అక్షిత అక్షరం… ప్రజల పక్షం

అక్షిత అక్షరం… ప్రజల పక్షం

-మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

అక్షిత అక్షరం… ప్రజల పక్షంలా పరిడవిల్లుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం క్యాంపు కార్యాలయంలో అక్షిత తెలుగు జాతీయ దినపత్రిక 2024 క్యాలెండర్ ను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించే వేదికగా అక్షిత అక్షర యజ్ఞం సాగిస్తుందన్నారు. నిజాలను నిర్భయంగా స్వేచ్ఛగా రాస్తూ ప్రజల సమస్యలకు వాస్తవ దర్పణం పడుతుందన్నారు. వివిధ ప్రధాన స్రవంతి కల్గిన పత్రికల్లో విశిష్ట సేవలందించిన అనుభవంతో చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగి సారథ్యంలో గత పదిహేనేళ్లుగా అక్షిత అక్షర సమరం మోగిస్తుందన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ పరిపాలన సాగుతుందన్నారు. ప్రజల వద్దకు పరిపాలన యంత్రాంగాన్ని పంపించి కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆరు గ్యారంటీలను అర్హులైన ప్రజలందరికి అందజేసే ప్రక్రియ శరవేగంగా సాగుతుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన వెనువెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతా ఉచిత ప్రయాణ సదుపాయం, రూ. 10లక్షల విలువైన ఆరోగ్య శ్రీ సదుపాయాలను కల్పించామన్నారు.మిగిలిన పథకాలను కూడా వంద రోజుల్లో చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా పాలన చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టే పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు అవసరమైన ప్రచారంతోనే ప్రజలకు అవగాహన కల్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అక్షిత బ్యూరో చీఫ్ షేక్ సయ్యద్ ఖాసీం జర్నలిస్ట్ తిరుపతి రావు మిత్రులు రామ్ నరేష్ కాంగ్రెస్ మైనార్టీ నాయకులు షేక్ ఇమామ్ బాయ్ కొణిజర్ల మండల కాంగ్రెస్ నాయకులు పెద్ద మునగాల సర్పంచ్ పరికపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking