పేదలకు సుపరిపాలన
రెప రెప లాడిన మువ్వన్నెల పతాక
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
75వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా జరుపుకుంటున్న వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, స్వాతంత్ర్య దినోత్సవానికి సమరయోధులకు, అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్ధినీ విద్యార్ధులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మనందరికి పండుగ రోజు. ప్రపంచంలోనే గొప్ప సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా భారతదేశమును నిలుపుకునేందుకు భారతరత్న డా.బి.ఆర్. అంబేడ్కర్ సారథ్యంలో భారత రాజ్యాంగం 1950, జనవరి 26న అమలులోకి తెచ్చుకున్నాం. భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు, భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను.ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.

మహాలక్ష్మి పథకం : నూతన ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే రెండు మానవీయ పథకాలను ప్రారంభించుకోవడం చాలా సంతోషం. తెలంగాణ ఆడబిడ్డలను మహా లక్ష్ములను చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకున్నాం. ఆర్ధిక పురోగతి సాధన లక్ష్యంగా వివిధ పనులకు వెళ్ళే వారికి, విద్యార్ధులకు, మధ్య తరగతి మహిళలకు, ట్రాన్స్ జండర్లకు ఈ పథకం ఉపయోగపడుతుంది. పై పెచ్చు ప్రయాణ ఖర్చుల కోసం కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. డిసెంబర్ 9వ తేదీన ప్రారంభించిన ఈ మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు 39 లక్షల 77 వేల 469 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ: పేదలకు మెరుగైన వైద్య సేవలు, సదుపాయాల విషయంలో ఏ వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదని, ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచటం జరిగింది. పేదలందరికీ ఉచితంగా కార్పోరేట్ వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చే ఈ పథకానికి డిసెంబర్, 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంపిక చేసిన ఆసుపత్రులలో తక్షణమే వైద్య సేవలు అమలులోకి వచ్చాయి. జిల్లాలో గడచిన ఏడాదికాలంలో 32 వేల 325 మందికి శస్త్ర చికిత్సలు అందించగా ఇందుకుగాను 63 కోట్ల 34 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
ప్రజాపాలన : ప్రజల చెంతకే ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళి ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం ఆరు గ్యారంటీల పథకాలకు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా 6 గ్యారంటీలలో భాగమైన మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందరమ్మ ఇల్లు మరియు చేయుత పథకాల అమలు కొరకు 5 లక్షల 27 వేల 492 దరఖాస్తులను స్వీకరించి ఆన్ లైన్ లో నమోదు చేయడం జరిగింది.
వ్యవసాయ శాఖ: జిల్లాలో రైతులకు పంట పెట్టుబడి సహాయం క్రింద 2023-24 యాసంగి సీజన్ లో 3 లక్షల 12 వేల 688 మంది రైతులకు 172 కోట్ల 41 లక్షల రూపాయలు పంటపెట్టుబడిగా పంపిణీ చేయనైనది.సాగునీటి పారుదల శాఖ: జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువ ద్వారా ఒక లక్షా 46 వేల ఎకరాలకు, ప్రాజెక్ట్ హెచ్ ఎల్ సి మరియు ఎల్ ఎల్ సి కాలువల ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాము.ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నవి. ఫ్లోరైడ్ బారి నుండి ప్రజలను రక్షించడం కొరకు చేపట్టిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు పురోగతిలో ఉన్నవి. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తి అయిన పిదప 200 గ్రామాలకు త్రాగు నీరు 14 మండలాలకు 3 లక్షల 61 వేల ఎకరాలకు సాగునీరు కల్పించబడుతుంది.
వైద్య మరియు ఆరోగ్య శాఖ : జిల్లా కేంద్రంలో 275 కోట్ల రూపాయలతో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు భవన నిర్మాణం మంజూరు అయింది మరియు పనులు పురోగతిలో ఉన్నవి.
23 కోట్ల 75 లక్షల రూపాయలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నల్లగొండ నందు 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ మంజూరై పనులు మొదలు కానున్నవి. నక్రేకల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఏరియా ఆసుపత్రిగా ఉన్నతీకరణకు 32 కోట్ల రూపాయలు మంజూరై పనులు జరుగుచున్నవి.
100 పడకల ఏరియా ఆసుపత్రి మిర్యాలగూడను 200 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరణకై 14 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు కాబడి పనులు జరుగుచున్నవి. 30 పడకల సి.హెచ్.సి. హాలియ ఏర్పాటుకై 5 కోట్ల 30 లక్షల రూపాయలు మంజూరై పనులు పురోగతిలో ఉన్నవి.
విద్యుత్: జిల్లాలో 2 లక్షల 29 వేల 838 మంది వ్యవసాయ వినియోగదారులు ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 8 వేల 235, 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకు 6 వేల 439 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. 30 కోట్ల 18 లక్షల రూపాయలతో 15 విద్యుత్ ఉప కేంద్రముల నిర్మాణ పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నవి.
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు: దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 34 వేల 500 కోట్ల రూపాయలతో 4 వేల మెగా వాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణ పనులు 2024 డిసెంబర్ నాటికి మొత్తం ఐదు యూనిట్లు పూర్తి చేయడానికి పనులు శరవేగంగా జరుగుచున్నవి.
మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమం: జిల్లాలో అనాధ బాలికలకు కొత్త బాలసదన్ భవన నిర్మాణమునకు ఒక కోటి 34 లక్షల రూపాయలు కేటాయించబడినది.వయో వృద్ధుల వసతి గృహము కొరకు కొత్త భవన నిర్మాణమునకు 50 లక్షల రూపాయలు కేటాయించబడినది.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ : 2023-24 ఆర్ధిక సంవత్సరంలో 130 కోట్ల 64 లక్షల రూపాయలు ఖర్చు చేసి 2 లక్షల 63 వేల మంది కూలీలకు 59 లక్షల 88 వేల పని దినాల ఉపాధి కల్పించడం జరిగినది మరియు 22 కోట్ల రూపాయలతో గ్రామ పంచాయితీలలో రోడ్లు మరియు మురికి కాలువలు మంజూరు చేయడం జరిగింది. ఆసరా పించన్ల పథకంలో వృద్దాప్య, వితంతు, కల్లుగీత, బీడీ, ఒంటరి మహిళలు మరియు చేనేత కార్మికులకు జిల్లాలో 2 లక్షల 10 వేల 611 మంది లబ్దిదారులకు 53 కోట్ల 73 లక్షల 43 వేల రూపాయలు పించన్లు ప్రతినెల పంపిణీ చేయడం జరుగుతుంది. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయబడే NAC స్కిల్ సెంటర్ ద్వారా 2 వేల మంది నిరుద్యోగ యువతీ యువతకు ఉపాధి కల్పించుటకు ప్రతిపాదనలు సిద్దం చేయడం జరిగింది. మహిళా స్వయం సహాయక సంఘాలు మరియు ట్రాన్స్ జెండర్ల సాధికారత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందించడం జరుగుతుంది.
రోడ్లు మరియు భవనాలు : ప్లాన్ నిధుల ద్వారా నల్లగొండ నుండి ముషంపల్లి-కన్నెకల్ (వయా) ధర్మాపురం వరకు 99 కోట్ల 80 లక్షల రూపాయలతో సింగల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చుటకు నిధులు మంజూరు చేయబడినవి. జిల్లాలో రోడ్లు, బ్రిడ్జిలు, BT రెనువల్స్, రోడ్ల విస్తరణ మొదలైన పనులకు గాను 292 కోట్ల 71 లక్షల రూపాయలతో పనులు చేపట్టబడుచున్నవి మరియు 32 కోట్ల 65 లక్షల రూపాయలతో దేవరకొండ మరియు నిడమనూరులో కోర్టు భవనాలు, జడ్జి రెసిడెన్షియల్ క్వార్టర్స్, నల్లగొండలో ఆర్&బి గెస్ట్ హౌజ్, ఆర్&బి ఆఫీస్ మరియు మిర్యాలగూడలో ఇండోర్ స్టేడియం మొదలైన పనులు జరుగుచున్నవి.
పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ : పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా గ్రామీణ రహదారుల నిర్మాణము, బ్రిడ్జి పనులు, భవనాల నిర్మాణము, రోడ్ల మరమ్మత్తులు ఇతర పనులకు గాను జిల్లాకు 783 కోట్ల 89 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 8 వేల 352 పనులు మంజూరు అయినాయి. ఇప్పటి వరకు 7 వేల 247 పనులు పూర్తి అయినవి. మిగిలిన పనులు పురోగతిలో కలవు.
పురపాలక సంఘాలు : జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో రహదారులు, జంక్షన్లు, ఆర్చ్ లు, చెరువుల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, సమీకృత శాఖాహార మరియు మాంసాహార మార్కెట్లు, రైతు బజార్, వైకుంఠధామాలు, వైకుంఠ రధాలు, భూగర్భ మురికి కాలువలకు, మంచినీటి సరఫరా కొరకు వివిధ పథకాల ద్వారా నల్లగొండ మున్సిపాలిటీలో 533 కోట్ల 6 లక్షలు, మిర్యాలగూడ మున్సిపాలిటీలో 101 కోట్ల 77 లక్షలు, దేవరకొండ మున్సిపాలిటీలో 56 కోట్ల 20 లక్షలు, చిట్యాల మున్సిపాలిటీలో 19 కోట్లు, నందికొండ మున్సిపాలిటీ 28 కోట్ల 85 లక్షలు, నక్రేకల్ మున్సిపాలిటీలో 31 కోట్ల 75 లక్షలు, హాలియా మున్సిపాలిటీలో 33 కోట్ల 77 లక్షలు, చండూరు మున్సిపాలిటీలో 52 కోట్ల 41 లక్షల రూపాయలతో అభివృద్ది పనులు జరుగుతున్నది.
వసతి గృహాలు: ఈ విద్యా సంవత్సరంలో 61 షెడ్యూల్డు కులముల వసతి గృహాలలో 3518 మంది, 42 గిరిజన వసతి గృహాలలో 8932 మంది, 46 వెనుకబడిన తరగతుల వసతి గృహాలలో 4899 మంది విద్యార్ధినీ విద్యార్ధులకు వసతి కల్పించనైనది.
ఉపకార వేతనములు: ఈ విద్యా సంవత్సరంలో 7608 షెడ్యూల్డు కులముల విద్యార్ధులకు 14 కోట్ల 65 లక్షలు, 2056 గిరిజన విద్యార్ధులకు 7 కోట్ల 35 లక్షలు, 21766 వెనుకబడిన తరగతుల విద్యార్ధులకు 17 కోట్ల 50 లక్షలు, 2228 మంది మైనారిటీ విద్యార్ధులకు 4 కోట్ల 5 లక్షల రూపాయలు ఉపకారవేతనములు చెల్లించడం జరిగింది.
గురుకుల విద్యాలయాలు: ఈ విద్యా సంవత్సరంలో 12 SC గురుకుల విద్యాలయాలలో 7 వేల మంది విద్యార్ధినీ విద్యార్ధులు, 13 ఎస్టీ గురుకుల విద్యాలయాలలో 7 వేల 920 మంది, 15 BC గురుకుల విద్యాలయాలలో 9 వేల మంది, 6 మైనార్టీ గురుకుల విద్యాలయాలలో 536 మంది విద్యానభ్యసిస్తున్నారు. జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధికి నిర్మాణాత్మక రీతిలో సహకారం, సూచనలు అందజేయుచున్న గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , జిల్లా పరిషత్ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి , గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు అందరికీ ఈ సంధర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జిల్లా ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న ప్రధాన న్యాయమూర్తికి, శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నల్లగొండకి, వివిధ శాఖల జిల్లా ఉద్యోగులకు, బ్యాంకర్లకు, స్వచ్చంద సేవా సంస్థలకు, ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసి జిల్లా ప్రజలను చైతన్యపరుస్తున్న మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.