ఉద్యోగుల హక్కుల పరిరక్షణ బాధ్యత అధికారులదే

ఉద్యోగుల హక్కుల పరిరక్షణ బాధ్యత అధికారులదే

* అక్రమంగా విధుల నుంచి తొలగింపునకు గురైన ఎన్ఎంఆర్ లస్కర్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

తెలంగాణ హైకోర్టు తీర్పు
పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన షేక్ హమీద్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

ఉద్యోగుల హక్కుల పరిరక్షణ బాధ్యత అధికారులదేనని తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖలో ఎన్ఎంఆర్ లస్కర్ గా విధులు నిర్వర్తిస్తున్న కె.సైదులును అక్రమంగా తొలగించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. నిబంధనలను తుంగలో తొక్కి కింది స్థాయి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం, తొలగించడం వంటి చర్యలను చేపట్టొద్దంటూ అధికారులకు ఘాటుగా చురకలంటించింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. అక్రమ తొలగింపునకు గురైన ఎన్ఎంఆర్ లస్కర్ సైదులు కేసులో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద తీర్పును వెల్లడించారు. పిటిషనర్ తరఫున హైకోర్టులో షేక్ హమీద్ న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున (సర్వీసెస్ -2) ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణానికి చెందిన కె.సైదులు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖలో ఎన్ఎం ఆర్ లస్కర్ గా దినసరి కూలీ ప్రాతిపదికన 1983 నుంచి 84 వరకు పని చేశారు. ఆయనతో పాటు 600 మందికి పైగా పలు డివిజన్ లలో పనిచేశారు. నాటి ప్రభుత్వం వీరందరినీ పని లేదనే సాకుతో తొలగించింది. 1988లో వీరందరి యూనియన్ తరఫున నారాయణ రావు అనే వ్యక్తి పోరాడారు. దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఆర్టికల్ 32 ప్రకారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అక్రమ తొలగింపునకు గురైన ఎన్ఎంఆర్ లస్కర్ లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిసెంబర్1, 1994 తేదీన WP 97/1988 కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలను జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎంఆర్ లస్కర్ లను 2008 నుంచి తిరిగి విధుల్లోకి తీసుకుంది. అయితే, ఎన్ఎంఆర్ లస్కర్ ల తరఫున పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి వారి వయస్సును సుమారుగా అఫిడవిట్ లో పొందుపరిచారు. కొందరి వయస్సు 2 ఏండ్లు అని మరికొందరి వయస్సు 15 ఏండ్లు అని, మరికొందరి వయస్సు ఎదుట ఎలాంటి అంకెను నమోదు చేయలేదు. కొందరి వయస్సు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో అస్సలు లేదు. ఎన్ఎంఆర్ లస్కర్ లను తిరిగి విధుల్లోకి తీసుకునే క్రమంలో వారి విద్యార్హతలు, స్థానికతతో పాటు వయస్సు ధృవీకరణ కోసం ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్, వయస్సు ధృవీకరణ ను సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి పొంది సమర్పించాలని చీఫ్ ఇంజినీర్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వారు మెమోలో నిర్దేశించారు. దీనికి అనుగుణంగా ఎన్ఎంఆర్ లస్కర్లు ఉద్యోగాల్లో చేరే సమయంలో ధృవీకరణ పత్రాలను సమర్పించారు. కాగా, అధికారులు వీటిని పరిగణనలోకి తీసుకోకుండా సుప్రీం కోర్టు అఫిడవిట్ లో ఉన్న వయస్సు ఆధారంగా ఉద్యోగులను తొలగించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో వారికి కనీసం నోటీసులు లేదా అవకాశం కూడా ఇవ్వలేదు. విద్యార్హతలు ఉన్నవారిని కూడా బలవంతంగా వయస్సు ధృవీకరణ చేసుకొని రావాలంటూ మెడికల్ బోర్డుల చుట్టూ తిప్పారు. దినసరి కూలీ ప్రాతిపదికన విధులు నిర్వర్తించే ఎన్ఎంఆర్ లస్కర్ లను అనేక ఇబ్బందులకు గురి చేశారు. అధికారుల చర్యలపై గౌరవ ట్రిబ్యునల్ కూడా అనేక కేసుల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా కొందరి సేవలు రెగ్యులర్ అయ్యాయి. కొంతమంది ఉద్యోగులు మాత్రమే కనీస వేతన చట్టం నిబంధనలకు అనుగుణంగా జీతాలు పొందుతున్నారు. తాజాగా, సైదులు కేసులో 2009 నుంచి నిర్విఘ్నంగా ఎన్ఎంఆర్ లస్కర్ గా విధులు నిర్వహిస్తున్న అతన్ని 2014 లో వయస్సు ధృవీకరణ సాకుతో మెడికల్ బోర్డుకు పంపారు అధికారులు. ఫిజికల్ ఫిట్ నేస్ సర్టిఫికెట్ వయస్సును ప్రామాణికంగా తీసుకొని ఉద్యోగ అవకాశం కల్పించిన అధికారులు మళ్లీ మళ్లీ ధ్రువీకరణలు చేసుకుంటూ వారి హక్కులకు తూట్లు పొడిచారు.
31, అక్టోబర్,2019 నుంచి సైదులు ను ఉద్యోగానికి అనుమతించలేదు. ఎలాంటి నోటీసు, అవకాశం ఇవ్వకుండా ఆయన్ని తొలగించారు. సమర్పించిన ధృవీకరణ పత్రాలకు అనుగుణంగా 2028 వరకు తనను ఉద్యోగంలో కొనసాగించాలని అధికారులను సైదులు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో, ఆయన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఉమానాథ్ పాండే & అథర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అండ్ అథర్స్ కేసు : సుప్రీం కోర్టు రిపోర్టర్ జడ్జిమెంట్ (2009) 12 ఎస్సీసీ 40 లోని పేరా 10, 11లో సహజ న్యాయ సూత్రాల గురించి జస్టిస్ సూరేపల్లి నంద ఉదహరించారు. అధికారులు జారీ చేసే ఉత్తర్వుల కారణంగా పౌరుల యొక్క ఇతరుల హక్కులను భంగం కలిగే సందర్భాల్లో కచ్చితంగా నోటీస్ జారీ చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరినీ వినాలని సదరు తీర్పులో జస్టిస్ సూచించారు. అంతేగాకుండా, పౌరుల హక్కుల కోసం రక్షణగా న్యాయస్థానాలు నిలవాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడిన అంశాన్ని తీర్పు ప్రతిలో పొందుపరిచారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking