తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర
రామోజీ రావు
*ఆఖరి క్షణం వరకూ ప్రజాశ్రేయస్సు కోసం పరితపించిన అక్షరయోధుడు
* రామోజీ రావు మృతి పట్ల భాస్కర్ రావు తీవ్ర దిగ్ర్భాంతి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు (88) మృతి పట్ల మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆఖరి క్షణం వరకూ ప్రజాశ్రేయస్సు కోసం పరితపించిన అక్షరయోధున్ని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలుగు రాష్ట్ర ప్రజలకు తీరని లోటు అని పేర్కొన్నారు. రామోజీ రావు కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో రామోజీ రావును ఈనెల 5న హైదారాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు. శనివారం తెల్లారుజామున ఉదయం 4.50 గంటలకు ఆయన మృతి చెందారు. రామోజీ రావు పార్థీవ దేహాన్ని ఫిల్మ్ సిటీలోని నివాసానికి తీసుకెళ్లనున్నట్టు సమాచారం. కాగా, సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనమైన రామోజీరావు అంచెలంచెలుగా ఎదిగారు. వేలాదిమందికి మార్గదర్శిగా నిలిచారు. రైతు బిడ్డగా, వ్యాపారవేత్తగా రాణించారు. 1974, ఆగస్టు 10న ఈనాడు దినపత్రిక ను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు.