అమర జవాన్ మహేష్…యువతకు స్ఫూర్తి

జూలై 25న అస్సాంలో అమరుడైన యువ జవాన్ మహేష్..
నేడు ఆ జవాన్ అంతిమయాత్ర సందర్భంగా..

యువ జవాన్ మహేష్ స్పూర్తిని ఎత్తి పడదాం....

పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

దేశ రక్షణ కోసం కల్లోల కడలిలో నిలబడిన వీర జవాన్ మహేష్ ను ఎముకలు కొరికే చలి కబలించివేసింది. మనం హాయిగా స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ బతుకుతున్నామంటే దానికి కారణం సైనికులు.వారు తమ కుటుంబాలను విడిచి రాత్రింబవళ్లు కళ్లలో ఒత్తులేసుకొని దేశాన్ని కాపాడుతుంటేనే మనం గుండెలపై చేయివేసుకొని కంటినిండా నిద్రపోగలుగుతున్నాం.ఇలా దేశ సేవలో ఎండనకా వాననకా ఎనిమిది నెలలకోసారి మాత్రమే ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. దేశ సరిహద్దుల్లో ఏలాంటి సౌకర్యాలు లేని ప్రతికూల ప్రదేశాలలో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యం బారిన పడి కన్ను మూసిన యువ జవాన్ ఈరటి మహేష్.

నల్లగొండ జిల్లా అనుముల మండలం మదారిగూడెం గ్రామానికి చెందిన ఈరటి యాదయ్య -పార్వతమ్మలకు మూడవ సంతానం మహేష్.నల్లగొండ లో డిగ్రీ చదువుతున్నప్పుడే ఎన్.సి.సి లో చేరి ఆర్మీ లో చేరాలనే కృత నిశ్చయంతో ముంధుకు సాగాడు.ఆ వైపు గా 2022 లో తన లక్ష్యాన్ని చేరుకున్నాడు.ఇతడు ఒక సైనిక కెరటం. దేశ రక్షణ కోసం రక్త తర్పణం చేసిన త్యాగ ధనుల మట్టిని గుండెలకు హత్తుకున్నాడు.ఆ నేలను ముద్దాడాడు.అమరవీరుల ఆశయాలను అణువణువునా నింపుకొని మూడు రంగుల జెండా నీడన ధైర్యాన్ని సానబట్టిన సాహాసి.యుద్దాలలో సైనికులు నడిచిన దారిలో చెరగని ముద్రలు అతని మనసును కలవరపాటుకు గుర్తు చేశాయి.ముగ్గురి సంతానంలో ఇద్దరు దేశ రక్షణ కై అంకితం అయ్యారు.తన త్యాగంతో దేశ చిత్ర పటాన్ని గీయాలని కళలు కన్నాడు.ఆ స్వప్నావిష్కరణ కోసం తపన పడ్డాడు.అదే స్వప్నం నిదురలోను, మెళకువ లోను,అందుకే తన జీవితాన్ని ఈ దేశ ప్రజలకు అంకితం ఇవ్వాలనుకున్నాడు.అతనిది వెలుగు దారి, అతనిది గెలుపు దారి.కోట్ల మంది ప్రజల నోళ్లలో హోరెత్తిన నినాదం జై జవాన్ ఆతని ఆయుధమైంది.అతను నడుస్తున్న దారంతా సైనికులంతా కదం తొక్కుతూ సాగిపోతున్న కవాతులు,వారు నడుస్తున్న దారంతా జై జవాన్ నినాదాలు,ఎగిసిన రక్తం చినుకులు, నింగి నేలను ఏకం చేస్తూ హోరెత్తిన నినాదాలలో మహేష్ స్వరం అర్ధాంతరంగా ఆగిపోయింది.

ఒక పేదింటి బిడ్డ ఆర్మీ జవాన్ ఐ 24 సంవత్సరాల వయస్సులోనే మరణించడం దురధృష్ఠకరం. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి దేశ సైనికున్ని చేసిన తల్లిదండ్రుల సంతోషం అనతి కాలంలోని ఆవిరైపోయింది..నా కుమారుడు దేశ సేవలో పాలు పంచుకుంటున్నాడని గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రులకు మహేష్ కన్నీటి ధారలు మిగిలిచి వెళ్లి పోయాడు.ఎదిగి వచ్చి,ఒక స్థాయిలో స్థిరపడ్డ కొడుకును చూస్తే ఏ తల్లిదండ్రుల కైనా గర్వంగా ఉంటది.చిన్న వయసులోనే దేశం కోసం నిలబడ్డతీరు,అతని కలుపుగోలుతనం ఆ గ్రామ ప్రజలందరి గుండెల్లో సజీవంగా ఉంచిపోయాడు. బౌతికంగా దూరమైన మహేష్ ను ఎవ్వరం తెచ్చి ఇవ్వలేం,ఆ కుటుంభంలో మహేష్ లేని లోటును ఎవ్వరం పూడ్చలేం.కాని ఆ యువ సైనికుడు దేశసేవకై పూనిన స్ఫూర్తిని ఎత్తిపట్టడమే మహేష్ కు మనం ఇచ్చే ఘన నివాళి.

ఈరటి మహేష్ కు జోహార్లు..

జై జవాన్……..జై హింద్…

బరువెక్కిన హృదయంతో…
నీ జ్ఞాపకాల యాదిలో..
మీ
పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192

Leave A Reply

Your email address will not be published.

Breaking