*పార్టీలకు అనుబంధంగా* *ఉండం…*
*జర్నలిస్టుల జీవితాలతోనే మా* *బంధం*
*-టీయూడబ్ల్యూజే అధ్యక్షులు* *విరాహత్ అలీ*
నాగర్ కర్నూల్, అక్షిత ప్రతినిధి :
65 యేండ్ల సుధీర్ఘ పోరాటాల చరిత్ర కలిగివున్న తమ సంఘం, నాటి నుండి నుండి నేటివరకు
ఏ పార్టీకీ అనుబంధంగా లేదని, కేవలం జర్నలిస్టుల జీవితాలతోనే బంధం కొనసాగిస్తుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ స్పష్టం చేశారు. ఆదివారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన యూనియన్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
జర్నలిస్టుల హక్కుల సాధనకై పోరాటాలు, త్యాగాలు తప్ప, ఏనాడూ తమ సంఘం రాజకీయ పార్టీల రంగుపుసుకోలేదని, అందుకే ఆరున్నర దశాబ్దాలుగా వేలాది జర్నలిస్టుల ఆధరాభిమానాలను చూరగొనగలుగుతున్నట్లు ఆయన అన్నారు. జర్నలిస్టుల పేరిట వెలిసిన కొన్ని సంఘాలు రాజకీయ రంగు పూసుకొని పెట్రేగి పోవడంతోనే అనతికాలంలో అవి కనుమరుగై పోయినట్లు విరాహత్ అన్నారు.
ఆవిర్భావం నుండి నేటి వరకు తమ సంఘం ఒకే స్వభావం, ఒకే సిద్దాంతంతో పనిచేస్తుందని, జర్నలిస్టుల సంక్షేమమే తమ జెండా, ఎజెండా అని ఆయన స్పష్టం చేశారు. గత పదేళ్లుగా ఎన్నో సమస్యలతో ఆందోళన చెందుతున్న జర్నలిస్టులకు ప్రస్తుత ప్రభుత్వం న్యాయం చేస్తుందనే భావన తమకు ఉందని ఆయన అన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్య భద్రతా, ఇంటి స్థలాలు, ఇండ్లు, విద్య తదితర సంక్షేమ చర్యల కోసం మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అవిశ్రాంతంగా శ్రమించడం అభి నందనీయమన్నారు. త్వరలో వేలాది జర్నలిస్టులతో తమ సంఘం భారీ సభను ఏర్పాటు చేయనుందని, ఈ సభకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహాని ఆహ్వానించునున్నట్లు విరాహత్ అలీ పేర్కొన్నారు. యూనియన్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జి.మధుగౌడ్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్ణయ్య, జిల్లా కార్యదర్శి రాములు నాయక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.