ప్రతి పేదోడికి ఇల్లు
20 లక్షల ఇళ్ల లక్ష్యం
తొలుత 5 లక్షల ఇళ్ళ నిర్మాణం
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ప్రతి పేదోడి స్వంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏ పల్లె, ఏ తండాకు వెళ్ళినా ఇందిరమ్మ ఇళ్లు దర్శనమిస్తాయని, పేదలకు కొండంత అండగా ఇందిరమ్మ ఇళ్లు ఉంటాయన్నారు. ప్రభుత్వం చేపట్టే అన్ని సంక్షేమ పథకాలు ఒక వంతు అయితే,మేం కట్టించే ఇందిరమ్మ ఇళ్లు మరో వంతన్నారు. ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వచ్చే నాలుగేళ్లలో దశల వారీగా సుమారు 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకుందని, తొలుత ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3500 నుంచి 4000 ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
నివాస స్ధలం ఉన్నవారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, రెండో దశలో ప్రభుత్వమే నివాస స్ధలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్ జెండర్లు, సఫాయి కర్మాచారులకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, మహిళ పేరు మీద ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ ఇండ్లకు నాలుగు దశల్లో లబ్దిదారులకు చెల్లింపులు చేస్తామని, మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్దిదారుని బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణం, వంట గది, టాయిలెట్ సౌకర్యాలను కలిగి ఉంటాయని, గత ప్రభుత్వంలో ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్యవస్ధ ఉండేదని, ఇప్పుడు ఆ వ్యవస్ధను రద్దు చేసి లబ్దిదారులే ఇళ్లు నిర్మించుకునేలా అవకాశం కల్పిస్తున్నామన్నారు.
లబ్దిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా నిర్మించుకోవచ్చన్నారు.పేదలకు ఇండ్లు నిర్మించే హౌసింగ్ శాఖను గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ఆ విభాగాన్ని మూసివేసి ఉన్న ఉద్యోగులను ఇతర శాఖలలో విలీనం చేసిందన్నారు.ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేస్తూ ఈ శాఖను పునరుద్ధరించి లబ్దిదారుల ఎంపిక నుంచి ఇండ్ల నిర్మాణం, పర్యవేక్షణ వరకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకుందన్నారు. 326 మంది ఉద్యోగులను తిరిగి నియమించడం ద్వారా హౌసింగ్ కార్పొరేషన్‌ను బలోపేతం చేశామన్నారు.
పారదర్శకంగా ఇందిరమ్మ లబ్దిదారుల ఎంపిక కోసం ప్రత్యేక మొబైల్ యాప్ ను రూపొందించామని, ఇప్పటికే నాలుగు గ్రామాలు, నాలుగు మునిసిపాలిటీలలోని నాలుగు వార్డుల్లో ప్రయోగాత్మకంగా సర్వే పూర్తి చేశామన్నారు. సర్పంచ్ / వార్డు కౌన్సిలర్ నేతృత్వంలో 7 మంది సభ్యులతో ఇందిరమ్మ ఇళ్ల అమలుకు ప్రతి గ్రామ పంచాయితీ, వార్డుల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రతి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో మోడల్ ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నామన్నారు.గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన 34,544 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రూ.305 కోట్లతో పూర్తి చేయడం జరిగిందని, గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారికి ఈ ఇండ్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
పోలీసులను పార్టీ కార్యకర్తలుగా వాడుకొని, ప్రతిపక్షాల ఫోన్లు టాప్ చేయించడం, డబ్బు మూటలు పట్టుకొచ్చిన వారిని తప్ప ఎవరినీ కలవకపోవడం, ప్రజలు నోరు తెరవకుండా ధర్నా చౌక్ లను ఎత్తేయడం, ఎమ్మెల్యేలు, మంత్రులను కలవకపోవడం భారత రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన స్వేచ్ఛను హరించి వేశారన్నారు. ప్రశ్నించిన ప్రతివాడికి పార్టీ నుంచి పోలీసుల నుంచి బెదిరింపులు చేసినవారిది, తుగ్లక్ పాలననా ? సచివాలయం నుండి ప్రజాపాలన నిర్వహిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న ప్రభుత్వానిది తుగ్లక్ పాలననా ? నని ప్రశ్నించారు.
ఎర్రవెల్లిని రాజధానిగా చేసుకుని, ఫాంహౌస్ ను సెక్రటేరియట్ చేసుకుని ఎవరి మాటా వినకుండా ఒక రాష్ట్రాన్ని తన ఇష్టం వచ్చినట్లు పాలించిన వారిది తుగ్లక్ పాలనా కాదా? మోడ్రన్ తుగ్లక్ మాత్రం ప్రజాస్వామ్య భారతదేశంలో ఈ శతాబ్దానికి కేసిఆర్ ఒక్కడేనన్నారు.తుగ్లక్ అంటే ఇట్లా ఉంటాడని ఒక పెద్దాయన పదేళ్ళపాటు ప్రజలకు సినిమా వేసి మరీ చూపించారని,పదేండ్లు ప్రజల నెత్తిన టోపీ పెట్టిన అసలు సిసలు తుగ్లక్ మహారాజ్… కేసిఆర్ అన్నారు. ఆ టైటిల్ కు ఇప్పుడే కాదు మరో 50 ఏండ్ల వరకు కూడా ఎవరూ పోటీకి రారన్నారు. చార్జ్ షీట్ పై స్పందిస్తూ, బీఆర్ఎస్ పదేండ్ల పాలనపై ఏడాది క్రితమే తెలంగాణ ప్రజానీకం వారికి డిస్ చార్జ్ షీట్ ఇచ్చిందని, మాజీ మంత్రి హరీష్ రావుకు ఇంకా కూడా జ్ఞానోదయం కాకపోవడం విచారకరమన్నారు. వారి వాలకం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని, పదేళ్ల పాలనలో వందేండ్లకు సరిపడా దోపిడీ చేసినవారే ఇవాళ చార్జ్ షీట్ అంటున్నారని దుయ్యబట్టారు.ఈ ఏడాది కాలంలో రెవెన్యూ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పలు నిర్ణయాలు తీసుకొని రెవెన్యూ సేవలను సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. రెవెన్యూ విభాగంలో గణనీయమైన ప్రగతిని సాధించామన్నారు. ఒక వైపు ధరణి పోర్టల్ ప్రక్షాళనకు అవసరమైన చర్యలు చేపడుతూనే, మరోవైపు ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకోవైపు కొత్త రెవెన్యూ చట్ట రూపకల్పనకు శ్రీకారం చుట్టి కొలిక్కి తీసుకువచ్చామని, వచ్చే శాసనసభ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం బిల్లును ప్రవేశపెట్ట బోతున్నామన్నారు. అలాగే టెర్రాసిస్ అనే విదేశీ సంస్ద నుంచి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను తప్పించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్వదేశీ సంస్ధ ఎన్ఐసికి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. ధరణి పోర్టల్ కారణంగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా వ్యవసాయదారులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, తరతరాలుగా తమ యజమాన్యంలో ఉన్న భూములపై సర్వ హక్కులు కోల్పోయారని, భూముల వివరాలను ధరణి పోర్టల్ లో నమోదు చేసే సమయంలో జరిగిన లోపాలు, అక్రమాలు, అవకతవకల వల్ల లక్షలాది మంది రైతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారన్నారు. రైతులు తమ భూములను అమ్ముకోవడానికి గాని, ఆ భూములపై బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి గాని రైతుల పడ్డ కష్టాలు వర్ణణాతీతమన్నారు.కాంగ్రెస్ ప్రజా పాలనలో ఈ పరిస్థితుల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాన్యులకు రెవెన్యూ సేవలు అందేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని, ముఖ్యంగా ధరణి సమస్యలపై సమీక్షించి వాటి పరిష్కారానికి మార్గాలను చూపించేందుకు భూ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు.ధరణి సమస్యలను పరిష్కరించేం దుకు కేంద్రీకృతమై ఉన్న అధికారాలను వికేంద్రీకరించి, మండల స్థాయిలో తహశీల్దార్‌కు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓలకు, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లకు సమస్యలను పరిష్కరించే అధికారాన్ని అప్పగించామన్నారు.ఒక్కప్పుడు ధరణీలో ఏ ఎంట్రీ మారినా ఎందుకు మారిందో తెలుసుకోవడానికి ధరణీ వెబ్‌సైట్‌లో కానీ, కాగితాల పైనా కానీ ఎలాంటి ఆధారం ఉండేది కాదని, ఇప్పుడు ఈ విధానాన్ని మార్చి ధరఖాస్తు వచ్చినప్పటి నుండి సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రతిదాన్ని కంప్యూటర్‌లో ఉంచి ఎవరైనా, ఎప్పుడైనా చూసుకునేలా చేశామన్నారు.
అప్పటి ప్రభుత్వంలో ఏ కారణం చెప్పకుండానే దరఖాస్తులను తిరస్కరించే వారని, కానీ ఇప్పుడు దరఖాస్తు తిరస్కరించాల్సి వస్తే ధరఖాస్తు దారునికి తిరస్కరణకు గల కారణాలు వివరిస్తూ ప్రతి ధరఖాస్తుపై నివేదికను తప్పనిసరి చేశామన్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి 2024 మార్చి 1 నుంచి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించామ న్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 2.46 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 1.38 లక్షల దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వంలో ధరణి సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే విశ్వాసం ప్రజల్లో ఏర్పడడంతో దరఖాస్తుల సంఖ్య పెరుగుతోందని, కొత్తగా 3.16 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఇప్పటివరకు వచ్చిన మొత్తం 5.62 లక్షల దరఖాస్తులలో 4.68 లక్షల దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందన్నారు. అంటే దాదాపు 83% దరఖాస్తులను పరిష్కరించి రైతాంగానికి ఈ ప్రభుత్వం అండగా నిలించిందన్నారు.
గత ప్రభుత్వంలో సంవత్సరాలు గడిచినా దరఖాస్తులకు మోక్షం లభించేది కాదని,ఇప్పుడు నెల వ్యవధిలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. అధికారంలోకి రాగానే ధరణి బాధ్యతలను ప్రభుత్వ సంస్థలకు అప్పగిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణను 2020 నవంబర్ నుంచి టెర్రాసిస్ అనే విదేశీ సంస్థకు అప్పగించిందన్నారు. ఫలితంగా 1 కోటి 56 లక్షల ఎకరాల తెలంగాణ భూముల వివరాలు ఆ విదేశీ సంస్ధ చేతిలోకి వెళ్లాయన్నారు.ఈ భూముల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండడంతో రైతులు భూ సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. ధరణి నిర్వహణ బాధ్యతను టెర్రాసిస్ సంస్థ నుంచి తొలగించి గతం కంటే ఏడాదికి రూ. 85 లక్షలు తక్కువ ధరకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్.ఐ.సి)కి డిసెంబర్ 1వ తేది నుంచి అప్పగించడం జరిగిందన్నారు.గత ప్రభుత్వం విఆర్‌వో, విఆర్ఎ వ్యవస్ధను రద్దుచేసి గ్రామీణ ప్రాంతాలలో సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసింది. గ్రామీణ ప్రాంతాలలో రెవెన్యూ వ్యవస్థను పటిష్ట పరచడానికి గ్రామాలలో రెవెన్యూ సేవలు పునరుద్ధరణకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక రెవెన్యూ ఉద్యోగిని నియమించడానికి కార్యాచరణను రూపొందించామన్నారు.రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా నూతన రెవెన్యూ చట్టం -2024ను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేశామన్నారు. అంతకు ముందు ఆగస్టు నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ముసాయిదా చట్టాన్ని అసెంబ్లీలో ప్‌లవేశపెట్టి విస్తృతంగా చర్చించామని, అదేరోజు సిసిఎల్‌ఏ వెబ్ సైట్ లో కూడా ముసాయిదా చట్టాన్ని పెట్టడం జరిగిందన్నారు.రైతు సంఘాలు, మేధావులు, ప్రజా ప్రతినిధులతో సాధారణ ప్రజానీకం మరియు రిటైర్డ్ అధికారుల నుంచి స్వీకరించిన సలహాలు, సూచనలతో కొత్త చట్టాన్ని తయారు చేశామని, ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ చేసిన సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోవడం జరిగిందన్నారు.అలాగే రంగారెడ్డి జిల్లా యాచారం, నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కూడా నిర్వహించడం జరిగిందని, పద్దెనిమిది రాష్ట్రాలలో అధ్యయనం చేసి అక్కడ అమలు అవుతున్న మంచి అంశాలను ఈ చట్టంలో పొందు పరచడం జరిగిందన్నారు.తరతరాల భూ సమస్యలకు ముగింపు పలికేలా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా, దేశానికే ఆదర్శంగా ఉండేలా ఒక రోల్ మోడల్ గా 2024 ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకు రాబోతున్నామన్నారు.