గ్రూప్ -2 పరీక్షలకు 4855 గైర్హాజర్
*పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ అమిత్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
టిజిపిఎస్సి ఆధ్వర్యంలో రాష్ర్ట వ్యాప్తంగా ఆదివారం గ్రూపు -2 పరీక్షలు మిర్యాలగూడలో ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగాయి. మిర్యాలగూడ పట్టణం, మండలంలో 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్ -1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగగా మధ్యాహ్నం పేపర్ -2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష కేంద్రాల వద్ద సుమారు 160 మంది సీఐలు, ఎస్ఐలు, ఎఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్ష హాలులోనికి పంపే ముందు అభ్యర్థులకు మెటల్ డిటెక్టర్ తో తనిఖీలు చేసిన తర్వాత పరీక్ష హాలులోకి అనుమతించారు. 28 పరీక్ష కేంద్రాలలో మొత్తం 7,941 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా పేపర్- 1 పరీక్షకు 3086 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 4,855 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పేపర్- 2 పరీక్షకు 3062 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా 4,879 అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదు, మొదటి పేపర్ కు హాజరైన వారిలో 24 మంది అభ్యర్థులు తగ్గారు. మిర్యాలగూడ లోని 28 కేంద్రాలలో 60 శాతం అభ్యర్థులు గ్రూప్-2 పరీక్షకు గైర్హాజరయ్యారు.
మిర్యాలగూడ పట్టణం, మండలంలో గ్రూప్- 2 పరీక్షలకు 28 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఎం.నారాయణ్ అమిత్ తనిఖీ చేశారు. ఆయన వెంట తహసిల్దార్ హరిబాబు, పరీక్షల రీజినల్ కోఆర్డినేటర్ వెంకటరమణ, అసిస్టెంట్ కో ఆర్డినేటర్ రాజు, రూట్ ఆఫీసర్లు మండల విద్యాధికారి ఎల్.బాలునాయక్, డి.ధర్మా నాయక్, కొర్ర కృష్ణ కాంత్ నాయక్, శివకుమార్, జాయింట్ రూట్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు కోట కరుణాకర్, పి.నాగార్జున, ఎస్ఐలు శోభన్ బాబు, వీరశేఖర్, సుధీర్ కుమార్, కె.నరేష్, వి.శేఖర్, పి.లోకేష్, ఉన్నారు. మినా మహిళా ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రానికి ఉదయం 9:30 గంటల తర్వాత వచ్చిన ఏడుగురు అభ్యర్థులను లోనికీ రూట్ ఆఫీసర్ అయిన రూరల్ ఎస్ఐ పి. లోకేష్ అనుమతించక పోవడంతో నిరాశతో వెనుదిరిగారు.