పేదలందరికి ఇళ్ళు

పేదలందరికి ఇళ్ళు

ఇళ్ల పట్టాల పంపిణీ
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు, అక్షిత ప్రతినిధి :

అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చూసే బాధ్యత తనదని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

గురువారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

నియోజకవర్గంలో కనీసం పది వేల మందికి ఇందిరమ్మ ఇండ్లు కావాలని ,ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పార్టీలకతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానని, నిరుపేదలు అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత తనదని తెలిపారు. ఇల్లు రానివారు ఎట్టి పరిస్థితిలో బాధపడొద్దని, భయపడవద్దని, అధైర్య పడకూడదని తెలిపారు.

మొదటి విడతన అర్హులైన నిరుపేదలకు 3500 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుండగా, తక్కినవారందరికీ రెండవ విడతలో ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇల్లు అనేది ఆత్మ గౌరవం అని, ఇంటితోనే మహిళకు అందం వస్తుందని, గత పది సంవత్సరాలలో ప్రభుత్వం ఏ ఒక్కరికి ఇల్లు కట్టిన పాపాన లేదన్నారు. అర్హులు ఏ ఒక్కరు ఇందిరమ్మ ఇళ్లు లేకుండా ఉండరాదని, అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు ఇల్లు రాకూడదని, ఈ బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. కొంత మంది నిరుపేదలు ఇదివరకే బేస్మెంట్ నిర్మించుకున్నారని, అలాంటి వారికి సైతం ఇల్లు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి లేఖ రాయాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు.ఇళ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకంగా ఉండాలని, ప్రభుత్వం ఇంటి కోసం మంజూరు చేస్తున్న 5 లక్షల రూపాయలు సరిపోవని ,ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి నల్గొండ జిల్లాలోని అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నందున డిస్కౌంట్ పై సిమెంట్ ఇచ్చే విధంగా లబ్ధిదారులకు మేలు జరిగేలా మాట్లాడతానని తెలిపారు. తాను నిరంతరం ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. నిరుపేద కుటుంబాల అందరికీ సొంతింటి కళ నెరవేరే వరకూ తను పోరాడుతానని తెలిపారు.

శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సంవత్సరాల తరబడి పూరి గుడిసెలో నివసిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం సంతోషమని అన్నారు. నియోజకవర్గంలో సుమారు పది వేల మంది వరకు నిరుపేదలు ఉన్నారని, వారందరికీ ఇల్లు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. మునుగోడు నియోజకవర్గం పూర్తిగా ఫ్లోరైడ్ ప్రాంతమని, సుమారు 1500 ఫీట్లు బోరూ వేసినా నీరు పడని పరిస్థితి ఉందని తెలిపారు. అర్హులకే అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చూసే బాధ్యత అధికారులపై ఉందని,అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా డిండి, ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లంల సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే మునుగోడు సస్యశ్యామలం అవుతుందన్నారు.క్షేత్ర స్థాయిలో మరోసారి పూర్తిగా పరిశీలించి అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇల్లు అనేది ఇల్లు మాత్రమే కాదని, ఆత్మ గౌరవం పెంచే కార్యక్రమం అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల జాబితాను పారదర్శకంగా తయారు చేశామని, ఇందుకుగాను 200 మంది లబ్ధిదారులకు ఒక గజటెడ్ అధికారిని నియమించి జాబితాను పరిశీలించి జిల్లాస్థాయిలో వచ్చిన జాబితాను 5% ర్యాండం పరిశీలన చేసి లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. మునుగోడు నియోజకవర్గంలో గురువారం 2100 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇళ్ల పట్టాలు పొందినవారు 30 రోజుల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభం చేయాలన్నారు. స్థానిక ఇసుక రీచుల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఇసుకను ఉచితంగా ఇస్తామని, లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఇండ్లు నిర్మించుకోవాలని, 600 చదరపు అడుగులకు పరిమితం కావాలని, ఇండ్లు పూర్తయ్యేలోపు 5 లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో వేస్తామని, లబ్దిదారులు ఇందిరమ్మ ఇళ్లపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు.

డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. జిల్లా గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్ కుమార్ ఇందిరమ్మ ఇండ్ల నియమ నిబంధనలు, నిర్దేశాలు, బిల్లుల చెల్లింపు, తదితర అంశాలను వివరించారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు పొందిన చండూరు మండలం పుల్లెముల గ్రామానికి చెందిన దండు ప్రేమలత ,మరో లబ్దిదారు అబీద మాట్లాడుతూ పేదలకు ముఖ్యంగా, గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం సంతోషమని, ఇందుకు ప్రభుత్వానికి, శాసనసభ్యులకు రుణపడి ఉంటామని తెలిపారు.

మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్,రెవిన్యూ. అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అనంతరం మునుగోడు నియోజకవర్గం పరిధిలోని మండలాల లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking