తుది శ్వాస వరకు ప్రజల కోసమే పని చేస్తా
– పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ
–రాజారంలో కాంగ్రెస్ పార్టీని వీడిన నలభై కుటుంబాలు కందాళ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరిక
ఖమ్మం /అక్షిత బ్యూరో :
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర కాలంలోనే కాంగ్రెస్ నాయకులు అధికార పార్టీని వీడి ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నారంటే ఆ పార్టీ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని పాలేరు మాజీ శాసన సభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు.
తిరుమలాయపాలెం మండలంలోని రాజారం గ్రామంలో అధికార పార్టీకి చెందిన నలభై కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని వీడి ఆదివారం పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన వారికి గులాభి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ తన ఆశయం ప్రజా సేవని తుది శ్వాస వరకు ప్రజల కోసమే పని చేస్తానని చెప్పారు.ఐదేళ్లు ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో పార్టీలకి కులాలకు అతీతంగా అవకాశం ఉన్నంత వరకు ప్రజల సంక్షేమం కోసం పని చేశానని తెలిపారు డబుల్ బెడ్ రూం ఇండ్లు సంక్షేమ పథకాలు విద్యార్థుల ఉన్నత చదువులు పాఠశాలలు ఆలయాలు నిర్మాణం కోసం పార్టీలు చూడకుండానే సాయం అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.సాధారణంగా నాయకులు అధికార పార్టీలోకి ఆకర్షితులవ్వడం సర్వ సాధారణం కాని గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పాలేరు ఎమ్మెల్యే స్థానిక మంత్రి ఎంపీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన రాజారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీని వీడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పై పాలన పై ఆ పార్టీ వారు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో తెలిసిపోతుందన్నారు. అధికార పార్టీని వీడి బిఆర్ఎస్ లో చేరడం రాబోయే ఎన్నికల గెలుపుకి నాంది అని తెలియజేశారు.పార్టీలో చేరిన వారు ఎలాంటి భయ బ్రాంతులకి గురికావాల్సిన అవసరం లేదని కందాళ ఉపేందర్ రెడ్డి అండగా ఉంటాడని అర్థరాత్రి ఫోన్ చేసిన స్పందిస్తానని వారికి హామీ ఇచ్చారు.