పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి: మహానీయుల స్ఫూర్తివేదిక డిమాండ్

  • పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి: మహానీయుల స్ఫూర్తివేదిక డిమాండ్
  • వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా 149వ జయంతి వేడుకలు

వనపర్తి, అక్షిత ప్రతినిధి: భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 149వ జయంతిని వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో మహానీయుల స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్, ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ, వెంకయ్య స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ పతాక రూపకర్త మాత్రమే కాకుండా భాషా పండితుడు, దేశభక్తుడిగా గుర్తింపు పొందారని వివరించారు. 1916లో జాతీయ పతాకంపై గ్రంథం రచించిన ఆయన ప్రపంచ జెండాల పరిశీలన చేసి భారత జెండాను రూపొందించారని పేర్కొన్నారు. కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన జెండాను రూపొందించిన వెంకయ్యకు గౌరవంగా “జెండా వెంకయ్య”, “పత్తి వెంకయ్య”, “డైమండ్ వెంకయ్య”, “జపాన్ వెంకయ్య” అనే పలు పేర్లు రావడం గర్వకారణమని అన్నారు. వెంకయ్య త్రివర్ణ పతాకం దేశ సమైక్యతకు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొంటూ, ఈ గౌరవం ఆయనకు భారతరత్న రూపంలో రావాల్సిన అవసరం ఉందన్నారు. పింగళి వెంకయ్య కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కవి పండితుడు భూరోజు గిరిరాజాచారి, వ్యాఖ్యాత డాక్టర్ నాయకంటి నరసింహ శర్మ, మైనార్టీ నాయకుడు బాలేమియ, చింతకుంట కురుమయ్య, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు శెట్టి, న్యాయవాది ఉత్తరయ్య, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking