- వరంగల్ తూర్పు లో శిధిలావస్థ లో జర్నలిస్టుల డబుల్ బెడ్రూంలు
- గత పాలకుల నిర్లక్ష్యం, ప్రస్తుత పాలకులు ఆలస్యం తో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యేనా
- అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన డబుల్ ఇండ్లు, తలుపులు కిటికీలు ట్యాంకులు, వైర్లు పైప్ లైన్లు అన్నీ మాయం
వరంగల్, అక్షిత బ్యూరో: తెలంగాణ ఏర్పడినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వరంగల్ కు విచ్చేసిన క్రమంలో శాఖ రాసి కుంటలో ఒక మాట అన్నారు. చిన్న చిన్న గున్న ఇండ్లు ఒకటే అర్ర ఉంటే పెళ్ళాం మొగలు సంసారం ఎట్లా చేస్తారు. పిల్లలు ఏడ పడుకుంటారు ఒకవేళ చుట్టాల వస్తె ఎక్కడ ఉంటారు. బిడ్డ పెళ్లి చేస్తే అల్లుడత్తే వాళ్ళు ఎక్కడ పడుకుంటారు అని అందరికీ ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చి వారిని గౌరవంగా బ్రతికేటట్లు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఇప్పుడు వరంగల్ తూర్పులో మంత్రిగా ఉన్న కొండా సురేఖ అప్పుడు కూడా కేసీఆర్ వెంట ఎమ్మెల్యేగా ఉండిరి. మనలో మాట ఏమన్నాడంటే ఏడాది తిరిగే లోపల మీ ఇండ్లన్నీ పూర్తయి మీరు ఇండ్లలోకి వచ్చేటప్పుడు మనం దావత్ చేసుకోవాలి కల్లు,గూడాలు దావత్ ఇయ్యాలే అని టిఆర్ఎస్ మొదటి ప్రభుత్వంలో హామీ ఇచ్చి వెళ్లిండు. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ పోటీ చేయలేదు టికెట్ ఇవ్వని కారణంగా రెండవ టిఆర్ఎస్ ప్రభుత్వంలో వరంగల్ తూర్పు నుంచి నన్నపనేని నరేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు.
2018 లో ఎమ్మెల్యేగా గెరిపొందాక కొన్నిచోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు. అందులో భాగంగా వరంగల్ తూర్పు ప్రాంతంలో దూపకుంట లో అనేక పోరాటాల్లో భాగస్వాములై తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు సైతం మోడల్ ఇండ్లు నిర్మిస్తున్నట్లు కేసిఆర్ ప్రకటించినక వారి కార్యక్రమాల్లో భాగంగా తూర్పు నియోజకవర్గంలో దేశాయిపేట పైడిపల్లి కి వెళ్ళు దారిలో 200 రెండు పడక గదుల ఇండ్లు మిగతా ఇండ్లు ఎట్లున్నాయో ఇవి కూడా అలాగే నిర్మించి ప్రత్యేకంగా వీటి కోసం అప్పటి మునిసిపల్ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును అప్పటి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వివిధ సంఘ బాధ్యులు చైర్మన్లు అప్పటి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తహసిల్దార్లు అన్ని శాఖల అధికారులు వచ్చి భూమి పూజ చేసి ఇక్కడ గతంలోనే తెలంగాణ రాకముందు అప్పటి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ బసవరాజ్ సారయ్య 2013లో ఇండ్లు లేని నిరుపేదలకు అప్పుడున్న కార్పొరేటర్ సమన్వయంతో ఇండ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కొంతమందికి పంపిణీ కూడా చేశారు కానీ వారికి పొజిషన్ చూపించలేదు ఈ విషయమై సమస్య వరంగల్ జిల్లా న్యాయస్థాన పరిధిలో నడుస్తూనే ఉన్నది.
ఇదిలా ఉండగా అప్పటి ఎమ్మెల్యేకు ఈ విషయాన్ని సదరు కార్పొరేటర్ ద్వారా బాధితులు విన్నవించుకోగా వారికి కూడా న్యాయం చేసేందుకు ఇండ్లు లేని నిరుపేదలందరికీ పట్టా పొంది ఉన్నవారికి కూడా న్యాయం చేస్తామని చెప్పినారు. పుణ్యకాలం గడుస్తున్న సందర్భంగా 2023 లో భూమికి పూజ చేసి శంకుస్థాపనలు చేసిన సదరు మంత్రివర్యులను మీడియా అకాడమీ చైర్మన్ జిల్లా అధికారులను కలెక్టర్తో సహా అందరూ వచ్చి నిర్మించిన ఇండ్లకు పూజలు నిర్వహించి ఆరుగురు జర్నలిస్టులకు ఇండ్లు కూడా అందించారు. మిగతా ఇండ్లు కూడా పంచితే సమస్య అక్కడితో అయిపోయేది. కానీ సదరు శాసనసభ్యుడు కొన్ని రాజకీయ కారణాలు జర్నలిస్టుల్లో ఉన్న అనైక్యత కారణంగా కొంత తప్పుడు సమాచారం వల్ల రాజకీయ ప్రజా ప్రతినిధులు ఇండ్లు పంచితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని ఇక్కడ గతంలో పట్టాలు పంపిణీ చేశారు కాబట్టి జర్నలిస్టులకు ఇల్లు కేటాయించినట్లయితే సమస్యలు తలెత్తి ఎన్నికల్లో ఇబ్బందులు వస్తాయని జిల్లా కలెక్టర్కు ప్రస్తుతం పదవుల్లో ఉన్నవారు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనితో గృహప్రవేశాలు చేసిన జర్నలిస్టులకు సైతం బ్రేక్ పడింది.
ఎన్నికలు అయిపోయాయి ఎమ్మెల్యేగా కొండ సురేఖ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనేకమార్లు జర్నలిస్టులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మంత్రి సురేఖను కలిసి ఎన్నిసార్లు విన్నవించిన ప్రభుత్వం దృష్టిలో ఉన్నది అవి జర్నలిస్టుల కోసం కట్టిన ఇండ్లు కాదు దారిద్రరేఖకు దిగువన ఉన్నవారికి నిర్మించబడ్డ ఇండ్లు అని నేరుగా చెప్పారు. అయినను జర్నలిస్టుల్లో బిపిఎల్ కేటగిరీకి చెందినవారు ఉంటే తప్పకుండా ఇస్తామని ఒక సందర్భంలో వాటిని పరిశీలించారు. లిస్టును కూడా తయారుచేసి జర్నలిస్టులే ఇవ్వవలసిందిగా యూనియన్ నాయకులకు తెలియజేశారు.
ఇది ఆదనుగ భావించిన కొన్ని సంఘాల నాయకులు ఒక బహుళ హోటల్లో కూర్చుని లిస్టు తయారు చేసినారు వర్కింగ్ జర్నలిస్టుల కాదా అనే తేడా లేకుండా తమకు నచ్చిన 180 మంది పేర్లను సిఫార్సు చేయించి స్థానిక శాసన సభ్యురాలు మంత్రి కొండా సురేఖకు జాబితా అందజేశారు. కానీ సదరు జాబితాలో కొంతమందిని పరిశీలించగా వారు దారిద్ర రేఖకు దిగువన కాకుండా ఎగువ శ్రేణిలో ఉండడంవల్ల చాలామంది పేదవారిది జాబితాలో పేర్లు లేకపోవడం వలన వారు వ్యక్తిగతంగా కొండా దంపతులను కలిసి విన్నవించడం వల్ల ఈ జాబితా అంతా తప్పులతడకగా ఉన్నదని వారు భావించి ఇండ్ల పంపిణీ వాయిదా వేసినట్లు సమాచారం. నాలుగు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనియన్లు ఉండగా అందులో ఒకటి రెండు యూనియన్లను మాత్రమే కలుపుకొని మిగతా వారికి దరికి రాకుండా చేస్తూ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న వారమని చెప్పుకుంటూ ప్రయత్నాలు సాగిస్తున్న ఒకటి రెండు యూనియన్ల కు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మంత్రి సురేఖ యూనియన్లు కలిసినప్పుడు అందరూ జర్నలిస్టులను కూర్చోబెట్టుకొని అందులో అర్హులు ఎవరు అనర్హులెవరు జాబితా సిద్ధం చేయాలని ఇలా ఇష్టం వచ్చినట్లుగా యూనియన్ నాయకులు వ్యవహరించడం సరైన పద్ధతి కాదని రాజకీయాలకు అతీతంగా యూనియన్లకు అతీతంగా నిజమైన లబ్ధిదారులను ఇండ్లు లేని పేద జర్నలిస్టులను ఎంపిక చేయాలని కోరారు.
ఇటీవల దేశాయిపేట లో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాల పంపిణీ సందర్భంగా జిల్లా కలెక్టర్ సాక్షిగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మంత్రి సురేఖ జర్నలిస్టుల విషయాన్ని ప్రస్తావిస్తూ సంఘాలకు గ్రూపులకు అతీతంగా డబుల్ బెడ్ రూమ్ ల జాబితా సిద్ధం చేయాలని నలుగురు యూనియన్ నాయకులు కూర్చుని నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసినట్లయితే వెంటనే వాటిని పంపిణీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ వరంగల్ మార్కెట్ ప్రాంతంలో నిర్మించిన జర్నలిస్టు సంక్షేమ భవనం కూడా కొంతమంది దానిని ఉపయోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇది ఒకరి కోసం నిర్మించింది కాదు దీనిని వరంగల్ తూర్పు లో ఉన్న జర్నలిస్టులు అందరికోసం నిర్మించామని ప్రతి యూనియన్ కు ఒక ఆఫీసు ఉండేటట్లు ప్రస్తుతం నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని కొండా దంపతులు సభాముఖంగా తెలియజేయడం జర్నలిస్టుల అనైక్యత డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపట్ల తప్పుడు జాబితా దాఖలాలు రుజువు చేస్తున్నాయి.
ఇదే విషయమై సంఘాలకు అతీతంగా జర్నలిస్టులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద రిలే నిరాహార దీక్షలకు కూర్చున్నారు కొంతకాలం పాటు సాగిన ఈ దీక్షలో వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు మద్దతు కూడా ప్రకటించాయి. సంఘాలకు యూనియన్లకు పత్రికలకు అతీతంగా సాగిన ఈ దీక్షలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఇతర నాయకులు కూడా మద్దతునిచ్చి జర్నలిస్టులకు సంఘీభావం తెలుపడం కోసమేరుపు.
డబుల్ బెడ్ రూములు నిర్మించి మూడు నాలుగు ఏండ్లు గడుస్తున్న ఇంకా వాటిని లబ్ధిదారులకు అందించకపోవడం వలన వాటిలో అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. అందులో వ్యభిచారం నిర్వహణ, పేకాట, బయటి వంటలకు వెళ్లడం, విద్యుత్ తీగలు పూర్తిగా ధ్వంసం చేయడం, నీటి వినియోగపు ట్యాంకులు పైపులు, డ్రైనేజీ పైపులు సెప్టిక్ ట్యాంకులు, స్విచ్ బోర్డులు, తలుపులు కిటికీలు, పూర్తిగా ధ్వంసం చేసి అవసరం ఉన్న కాడికి తీసుకుపోతూ ఇంకా కొన్ని తీసుకుని తరలించేందుకు సిద్ధంగా పెట్టుకున్నారు. దాదాపు 50 శాతం కు పైగా ఇండ్లలో ఈ పరిస్థితి ఎదురైంది ఇప్పటికే తలుపులు కిటికీలు మాయమయ్యాయి గోడలు మాత్రం దర్శనమిస్తున్నాయి. కొద్ది రోజుల్లో ఇనుప వస్తువులు కూడా తరలించుకుపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా వాటిని యూనియన్లో వారీగా డబుల్ బెడ్ రూమ్ లో వద్దే జర్నలిస్టు సంఘాల నాయకులను పనిచేసే జర్నలిస్టులను కూర్చోపెట్టి లిస్టు ఫైనల్ చేసి వారికి అందించవలసిందిగా వర్కింగ్ జర్నలిస్టులు బాధిత బిపిఎల్ లబ్ధిదారులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అవసరమైతే గతంలో పట్టాలు ఉండి ఇండ్లు లేకుండా ఉన్న నిజమైన లబ్ధిదారులకు గతంలో ప్రమాణం చేసిన మాదిరిగానే జర్నలిస్టులకు పట్టాలు పొందిన వారికి న్యాయం చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రజాధనంతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన భువన సముదాయాన్ని వృధా చేయకుండా వాడుకలోకి తీసుకురావాలని ఇండ్లు లేని నిరుపేదలు కోరుకుంటున్నారు.
