- విద్యార్థుల హాజరు పెంచాలి
- సంక్షేమ హాస్టళ్ల ఆకస్మిక తనిఖీ
- మండల ప్రత్యేక అధికారి జిల్లా సహకార అధికారి పత్యా నాయక్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థుల హాజరును పెంచాలని మండల ప్రత్యేక అధికారి జిల్లా సహకార శాఖ అధికారి పత్యా నాయక్ కోరారు. తెలంగాణ గిరిజన బాలికల పాఠశాల గిరిజన సంక్షేమ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, స్టోర్, వంటగదులను పరిశీలించి తాజా కూరగాయలు, పరిశుభ్ర ఆహార పదార్థాలు మాత్రమే విద్యార్థులకు అందించాలన్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బంది సమయపాలన పాటించే విధంగా ప్రిన్సిపాల్ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. పాఠశాలలో అపరిశుభ్ర వాతావరణం కనబడితే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్వహించబడే పాఠశాలలో విద్యార్థులకు సెలవులు ఇవ్వకూడదని 100 శాతం హాజరు ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. హాస్టల్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి అభ్యసన సామర్ధ్యాలు పెంపొందింప చేయుటకు వార్డెన్లు బాధ్యత వహించాలన్నారు.
