జర్నలిస్టుల పట్ల పాలకుల వివక్షను ప్రతిఘటిద్దాం – రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

వరంగల్, అక్షిత బ్యూరో: జర్నలిస్టుల పట్ల పాలకులు వివక్ష చూపుతున్నారని, పాలకుల వైఖరిని ఐక్యంగా ప్రతిఘటించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ జర్నలిస్టు యూనియన్ లకు చెందిన నాయకులు టీడబ్ల్యూజేఎఫ్ లో చేరారు. వారందరికీ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య సభ్యత్వం ఇచ్చి సంఘంలోకి ఆహ్వానించారు. అదేవిధంగా అంతకుముందు సభ్యత్వం తీసుకున్న ఫెడరేషన్ సభ్యులకు ఫెడరేషన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడం తగదన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా…జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా జాప్యం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పోరాటానికి జర్నలిస్టులు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మెజారిటీ జర్నలిస్టుల జీవన స్థితిగతులు దయనీయంగా మారుతున్నాయని, మండల స్థాయి విలేకరుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తొమ్మిదేళ్లు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించలేదని, అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెండు జర్నలిస్టు సంఘాలు పాలకుల పక్షాన చేరి జర్నలిస్టులకు అన్యాయం చేశాయని విమర్శించారు. జర్నలిస్టులందరికీ ఉపయోగపడాల్సిన మీడియా అకాడమీని ఒక యూనియన్ తమ జేబు సంస్థగా మార్చుకున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు ఏం ఒరిగిందో, ఏం మేలు చేశారో పాలకులు, ఆ రెండు జర్నలిస్టు సంఘాలు చెప్పాలని అన్నారు. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు జర్నలిస్టుల పేరు చెప్పి అధికార పదవులు పొంది పాలకులకు ఊడిగం చేస్తూ, జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. అలాంటి జర్నలిస్టు సంఘాల పట్ల జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇండ్ల స్థలాల విషయంలో గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయమే ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతుందని, రాష్ట్రంలో చాలా ఏళ్ళుగా నడుస్తున్న అనేక చిన్న పత్రికలను ప్రభుత్వం గుర్తించకుండా అణచివేస్తున్నదని మామిడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా కొత్త అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్ అని గుర్తించిన జర్నలిస్టులు రాష్ట్రవ్యాప్తంగా ఇతర సంఘాల నుంచి పెద్దఎత్తున సంఘంలో చేరుతున్నారని చెప్పారు. రాబోయే రెండు మూడు మాసాల్లో అన్ని జిల్లాల్లో ఫెడరేషన్ మహాసభలు పూర్తి చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభలకు సిద్దమవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వల్లాల జగన్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడు బాపురావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోపాల్, పంతాటి రవీందర్, సీనియర్ జర్నలిస్ట్ ఎండి సాదిక్, తదితరులు పాల్గొని మాట్లాడారు. టీడబ్ల్యూజేఎఫ్ లో చేరిన వివిధ పత్రికలు, న్యూస్ చానళ్ళ జిల్లా రిపోర్టర్లు, ఆర్సీ ఇన్చార్జీలను ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు బండారి రాజు, పెండ్యాల రంజిత్ కుమార్, బత్తుల మహేష్, సల్పల తిరుపతి, మార్క మురళి, తిరుపతి, చారి, రాజు, రాజేందర్, సమ్మయ్య, సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking