భూపాలపల్లి ఘటనపై ఎమ్మెల్యే సీరియస్
– ఈ ఘటన వెనుక ఎంతటివారున్నా ఉపేక్షించేది లేదన్న ఎమ్మెల్యే జీఎస్సార్..
– దోషులపై కఠిన చర్యలు తప్పవన్న ఎమ్మెల్యే..
వరంగల్, అక్షిత బ్యూరో:
భూపాలపల్లి జిల్లా కేంద్రం గాంధీనగర్ లోని ప్రభుత్వ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్(యూఆర్ఎస్)లో కలుషిత నీరు తాగి 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సీరియస్ అయ్యారు. శనివారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అడిషనల్ కలెక్టర్లు, డీఈవో, డీఎస్పీ ఇతర అధికారులతో కలిసి స్కూల్, హాస్టల్ ను పరిశీలించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11 మంది విద్యార్థులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. 24 గంటల పాటు వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అర్బన్ రెసిడెన్సీ స్కూల్ లో జరిగిన ఘటన విచారకరమని అన్నారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపడుతున్నామని అన్నారు. స్కూల్ ఆవరణలో ఓ టీచర్ గదిలో ఉన్న దగ్గు మందు సీసా లో ఉన్న ను పురుగు మందులకు సంబంధించిన ద్రావణం ఉన్నట్లు విచారణలో తేలిందని అన్నారు. అర్బన్ పాఠశాలలో మొత్తం 40 మంది విద్యార్థులు వున్నారని వారి అభిప్రాయం తెలుసుకోవడం జరిగిందన్నారు. టీచర్ల మధ్య గ్రూపు విబేధాలు ఉన్నట్లు తెలుస్తుందని వారి తగాదాల్లో పిల్లలను ఆగం చేసే కుట్ర చేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.