*చింతల్ వాజ్పేయి నగర్ ఇళ్లలోకి వర్షపు – డ్రైనేజీ నీరు*
*ఇళ్ళల్లోకి నీరు చేరి ప్రజల ఇక్కట్లు*
అక్షిత న్యూస్ / గాజులరామారం:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131వ డివిజన్ చింతల్ వాజ్పేయి నగర్‌లో వర్షం పడితే ఇళ్లలోకి నీరు చేరడం ప్రజలకు శాశ్వత సమస్యగా మారింది. బుధవారం కురిసిన భారీ వర్షానికి స్థానిక చర్చ గల్లీలో వరదనీరు, డ్రైనేజీ నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రజల ఆవేదన ప్రకారం గత ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అప్పటికే సమస్యను జీహెచ్ఎంసి కుత్బుల్లాపూర్ సర్కిల్ ఇంజనీరింగ్ శాఖ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెలనెలా జీతాలు అందుకుంటున్న అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపించారు. వర్షం పడినప్పుడల్లా ప్రాణాలు అరచేత పట్టుకుని గడపాల్సిన పరిస్థితి నెలకొంటోందని వేదన వ్యక్తం చేస్తున్నారు.
“మరింత వర్షం కురిస్తే ఏమవుతుందోనన్న భయంతో జీవిస్తున్నాం. ఇకనైనా అధికారులు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలి” అని వరద బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.