అంగరంగ వైభవంగా ఆఖరి బోనాలు

అంగరంగ వైభవంగా
ఆఖరి బోనాలు

తొలి బోనాలు గోల్కొండలో
చివరి బోనాలు చందుపట్లలో..

భాద్రపద మాసంలో బోనాలు
గ్రామంలో అనాది ఆనవాయితీ

కిలోమీటర్ పైగా
వందలాదిమంది మహిళలతో
బోనాల శోభాయాత్ర

ఎడ్లబండ్ల స్థానంలో
ట్రాక్టర్ల ర్యాలీ

పోతరాజుల విన్యాసాలు
యాట పోతుల ప్రదర్శనలు

( *మంగినేపల్లి సాయికుమార్* )

చందుపట్ల/ నల్గొండ, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బోనాలు. ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లతో అలరించిన బోనాలు. తెలంగాణ సాంప్రదాయాలకు నిదర్శనంగా ఆషాడమాసంలో ప్రారంభమైన బోనాల ఉత్సవాలు నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో గురువారం జరిగిన కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. ఆషాడ మాసంలో హైదరాబాదులోని గోల్కొండలో బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కాగా రాష్ట్ర మంతటా ఆషాడ శ్రావణ మాసాల్లో బోనాలు నిర్వహిస్తారు. కానీ నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో భాద్రపద మాసంలో అనగా వినాయక నవరాత్రి ఉత్సవాల తర్వాత విజయదశమి లోపు బోనాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ.

గ్రామంలో భూస్వాములు, సన్న చిన్న కారు రైతులు, వ్యవసాయ కూలీలు, అత్యధికంగా ఉండడం వల్ల వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలంతా వ్యవసాయ పనులు ముగిసి పంటలు ఇంటికి చేరిన తర్వాత ఉత్సవాలు నిర్వహించడం సాంప్రదాయంగా మారింది. అందులో భాగంగానే ఈసారి గురువారం రోజున కన్నుల పండుగగా ఉత్సవాలు సాగాయి. భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం గ్రామానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించగా నకిరేకల్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గాజువాక సుకన్య శ్రీనివాస్ ముత్యాలమ్మ తల్లికి వెండి వడ్డాణం కళ్ళు, ఈదమ్మ తల్లికి చందుపట్ల శివారు కొత్త వారి గూడెం గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి దంపతులు వెండి మకర తోరణం సమర్పించి ముక్కులు తీర్చుకోవడం ఉత్సవానికి నిండుతనం చేకూర్చాయి.

ఈ సందర్భంగా గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది పోతుల నరేష్ ను సముచిత రీతిన సత్కరించారు. తొలుత బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ ఇంటి నుండి గంప బోనంతో ప్రారంభమై గ్రామ దేవతలు అందరిని పూజించి మొక్కులు సమర్పించారు.


చివరిగా మంగళ వాయిద్యాలు మేళ తాళాల మధ్య పోతురాజుల విన్యాసాలు యాట పోతుల ఊరేగింపులు వాటి వెనుక రంగురంగుల చీరలతో అందంగా ముస్తాబైన వందలాదిమంది మహిళలు అమ్మవారికి వండి తయారు చేసిన నైవేద్యాన్ని కుండలో పెట్టి ఆ పైన జ్యోతి వెలిగించిన బోనాలను మామిడాకులు వేపమండలతో అలంకరించి వాటిని తలపై పెట్టుకుని గ్రామానికి సుమారు కిలోమీటర్ పైగా ఉన్న ముత్యాలమ్మ తల్లి వద్దకు ఊరేగింపుగా బయలుదేరగా వారి వెనుక ట్రాక్టర్లు ( పలారం బండ్లు) ఊరేగింపుగా వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి పెట్టిన ఫలహారాన్ని ప్రజలకు పంచిపెట్టి ఉత్సవాన్ని ముగించారు. అయితే ఇది మొక్కుబడిగా నిర్వహించే కార్యక్రమం మాత్రమే రాకుండా కుల మతాలకు అతీతంగా ప్రజలంతా బోనాల పండుగ సందర్భంగా తమ ఇంటి అల్లుళ్లను ఆడపిల్లలందరినీ ఆహ్వానించి అత్యంత సందడిగా నిర్వహించడంతో ప్రతి ఇంటా పండుగ కళ తాండవించింది. అంతేకాకుండా ఉత్సవ నిర్వహణలో అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పించడంతో అందరూ ఆనందోత్సాహాలతో పండుగ నిర్వహించుకున్నారు.మాజీ ప్రజాప్రతినిధులను సన్మానించారు. మేడవరపు రంగారావు జ్ఞాపకార్థం కొడుకు అశోక రావు ఆధ్వర్యంలో ప్రజలకు అన్న సంతర్పణ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking