జర్నలిస్టు కుటుంబాలకు ఆసరా
సీతక్క చేతుల మీదుగా చెక్కుల పంపిణీ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి 18 మంది జర్నలిస్టు కుటుంబాలకు, అనారోగ్యం, ప్రమాదాలకు గురైన ఏడుగురు జర్నలిస్టులకు సోమవారం, 29 సెప్టెంబర్, 2025 నాడు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు తెలిపారు. “జర్నలిస్టుల సంక్షేమం – ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం” పేరిట రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు, పనిచేయలేని, నిస్సహాయ స్థితిలో ఉన్న జర్నలిస్టులకు, జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి వచ్చిన వడ్డీతో మీడియా అకాడమీ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.
నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి ఆడిటోరియంలో సోమవారం, 29 సెప్టెంబర్, 2025 నాడు ఉదయం 10-30 గంటలకు చెక్కుల పంపిణి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని చెక్కుల పంపిణీ చేస్తారన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని తెలిపారు. సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీమతి సి.హెచ్. ప్రియాంక గౌరవ అతిధిగా పాల్గొంటున్నారని ఆయన తెలియజేశారు. అంతేగాక జర్నలిస్టు నాయకులు, తదితరులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.