ముడుపులు ఇచ్చుకో…ముప్పై షట్టర్లు కట్టుకో

ముడుపులు ఇచ్చుకో…

    ముప్పై షట్టర్లు కట్టుకో 

ఇక్కడ అక్రమ కట్టడాలు “మామూలే” 

లంచాలకు తలొగ్గి అక్రమాలకు పచ్చజెండా

బల్దియా సర్కిల్‌ 25లో అవినీతి జాతర ?

అక్రమ కట్టడాలపై చర్యలు శూన్యం

అక్షిత న్యూస్ / గాజులరామారం :

హైదరాబాద్‌ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే వేగంగా అక్రమ నిర్మాణాల ముళ్లు నగర రూపురేఖలను చెదరగొడుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలు, పట్టణ ప్రణాళికలు, భద్రతా ప్రమాణాలు అన్నీ పక్కన పెట్టి “ముడుపులు ఇచ్చుకో, ముప్పై షేటర్లు కట్టుకో” అన్న చింతనతో అక్రమ కట్టడాలు వెలిసిపోతున్నాయి. ముఖ్యంగా బల్దియా సర్కిల్‌ 25 కుత్బుల్లాపూర్ పరిధిలో అవినీతి, నిర్లక్ష్యం పతాక స్థాయికి చేరిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టణ ప్రణాళిక విభాగం రూపొందించిన నియమ నిబంధనల ప్రకారం భవనాల ఎత్తు, సెట్‌బ్యాక్‌లు, పార్కింగ్‌ స్థలం, అగ్నిమాపక భద్రత వంటి అంశాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయితే, వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉంది. బిల్డ్ నౌ వంటి ఆన్‌లైన్‌ అనుమతుల వ్యవస్థ ద్వారా పారదర్శకత పెరగాలని ప్రభుత్వం భావించినా, అధికారి–దలారుల మిలాఖత్ కారణంగా అక్రమాలు నిర్భయంగా కొనసాగుతున్నాయి.

కుత్బుల్లాపూర్‌ జోన్‌లోని సుభాష్‌నగర్‌ పైప్‌లైన్‌ రోడ్డులో ఒక భవనం స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది. అనుమతులు లేకుండా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పది కమర్షియల్‌ షేటర్లు, మొదటి అంతస్థులో మరో పది షేటర్లు కట్టుకుని యజమాని నిర్భయంగా అంతా శరా మామూలే , అధికారులు అంతా నా చెప్పుచేతల్లో ఉన్నారంటు మునిసిపల్ సిబ్బందికి సవాల్ విసురుతున్నారు , ఇదే సుభాష్ నగర్లో భారీగా చాలా అక్రమ షేడ్లు నిర్మాణం అవుతున్నాయని స్థానిక ప్రజలు పలు మార్లు ఫిర్యాదులు చేసినా, జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం కళ్లుమూసుకున్నారు. పట్టణ ప్రణాళికాధికారి మధు స్పందించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు “నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఏవైనా వివరణలు కావాలంటే డిప్యూటీ కమీషనర్‌ని అడగండి” అంటూ ముఖం చాటేస్తున్నారు . ఇది కేవలం ఒకట్రెండు అక్రమాల కథ మాత్రమే కాదు — సర్కిల్‌ 25 పరిధిలో ఇదే తరహా అక్రమ నిర్మాణాలు డజన్లకొద్దీ నిత్యం కొనసాగుతున్నాయి. అధికారం ఉన్నవారు లంచాలు తీసుకుని నిబంధనలకు పచ్చజెండా ఊపుతున్నారు. అనుమతులు లేకుండా ఫ్లాట్లు, షాపులు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు నిర్మించడం ఇప్పుడు “మామూలు విషయం”గా మారిపోయింది ఇక్కడ. ఈ అక్రమ కట్టడాల వల్ల ఈ పరిధిలోని మౌలిక వసతులపై విపరీత ఒత్తిడి పెరుగుతోంది. రోడ్లపై రద్దీ పెరగడం, పార్కింగ్‌ స్థలాల కొరత, నీటి, విద్యుత్‌ సరఫరాపై భారమయ్యే పరిస్థితులు, ముఖ్యంగా అగ్నిప్రమాదాల ప్రమాదం రోజురోజుకు ఎక్కువవుతోంది. అయితే, వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అవినీతికి తలొగ్గి మౌనం పాటిస్తున్నారు.

కోర్టులు కూడా పలుమార్లు జీహెచ్‌ఎంసీని తీవ్రంగా హెచ్చరించాయి. అయినప్పటికీ చర్యలు లేకపోవడం పౌరులలో నిరాశను కలిగిస్తోంది. ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి తమ స్వార్థంతో కూడిన స్వలాభం కోసం అధికారుల అడ్డదారులు తొక్కుతున్న వారిపై చర్యలు శూన్యం అంటూ ప్రజలు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు .

సర్కిల్‌ 25లో బల్దియా అధికారులు “ముడుపులు చెల్లిస్తే ఏ నిర్మాణం అయినా కట్టుకోవచ్చు” అన్న దృష్టాంతాలు ఇప్పుడు బహిరంగ రహస్యాలుగా మారాయి. పౌరులు ప్రశ్నించినా, సమాధానం ఇచ్చేవారు లేరు. ఈ పరిస్థితి కొనసాగితే, నగర రూపకల్పన దెబ్బతింటుంది. రేపటి తరాలకు ప్రమాదకరమైన మౌలిక సదుపాయాలు మాత్రమే మిగులుతాయి. అధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం , విజిలేన్స్ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ఈ అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking