72 గంటల్లో
డబ్బులు జమ
ధాన్యం అమ్మిన
రైతుల ఖాతాల్లో జమ
రూ.25 వేల కోట్లతో
ధాన్యం కొనుగోళ్లు
సన్న ధాన్యాన్ని
పండించాలి
అత్యధిక ధాన్యం
పండించే జిల్లాల్లో
నల్గొండ 2 వది
రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తిప్పర్తి, అక్షిత న్యూస్ :
ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో డబ్బులను 72 గంటలు జమ చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం అయన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం, కంకణాలపల్లి, అంతయగూడెం, మామిడాలపల్లి గ్రామాలలో ఐకెపి ద్వారా ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అంతేగాక కంకణాలపల్లిలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. తిప్పర్తి మండల కేంద్రంలో ధాన్యం తరలించే లారీలను జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మాట్లాడుతూ రైతుల కళ్ళల్లో సంతోషాన్ని చూడడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.

అందుకే ప్రభుత్వం రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఖరీఫ్ ధాన్యం అమ్మిన రైతులకు డబ్బులు చెల్లించేందుకు గాను 25 వేల కోట్ల రూపాయలను క్యాబినెట్ కేటాయించినట్లు వెల్లడించారు. రైతులు ధాన్యం అమ్మిన డబ్బుల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదని, 72 గంటల్లో వారి ఖాతాలలో జమ చేస్తామని, ఒకవేళ డబ్బులు జమ కాకుంటే తనకు నేరుగా ఫోన్ చేయవచ్చు అని తెలిపారు. రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా అత్యధికంగా ధాన్యం పండించే రెండవ జిల్లాగా నిలిచిందని, అయితే రైతులు సన్న ధాన్యాన్ని ఎక్కువగా పండించాలని, ఈ దిశగా అధికారులు ప్రోత్సహించాలని సూచించారు.

ధనవంతుల మాదిరిగానే సన్న బియ్యం తినాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం అందిస్తున్నదని, అందువల్ల సన్న బియ్యాన్ని ఎక్కువగా పండించాలన్నారు.నిజామాబాద్ జిల్లాలో 75% సన్న బియ్యం పండిస్తున్నారని, అందువల్ల నల్గొండ జిల్లాలో సైతం సన్నబియ్యనికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, ఇందులో భాగంగా ఆర్అండ్ బి శాఖ ద్వారా 6600 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టామని, 4500 కోట్ల రూపాయలకు ఇటీవలే క్యాబినెట్ అనుమతి తీసుకున్నామని త్వరలోనే టెండర్లు పిలిచి జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల నుండి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు, గ్రామాల నుండి మండలాలకు సింగిల్ రహదారి సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, ఇందుకు క్యాబినేట్ కూడ అనుమతించడం జరిగిందని ఆయన వెల్లడించారు. రహదారి, రవాణా సౌకర్యం బాగున్నప్పుడే రైతులు పండించిన ఉత్పత్తులను మార్కెట్ కు తీసుకు వెళ్ళేందుకు వీలు కలుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు 7 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని, 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని, గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలో దాన్యం లారీలకు జండా ఊపి ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం మిల్లులు తరలించడం, ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ఇందుకుగాను ట్రాన్స్పోర్ట్ యజమానులు, లారీల యజమానులు సహకరించాలని, నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీల ద్వారా తరలిoచాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడారు. అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి , డిఎస్ఓ వెంకటేష్, పౌర సరఫరాల డిఎం గోపికృష్ణ, డిసిఓ పత్యానాయక్, డిసిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి, పాశం రాంరెడ్డి, ఇతర ప్రజాప్రతి నిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.