అర్హులందరికీ సంక్షేమ పథకాలు
– వెల్లంకి గ్రామంలో పల్లె నిద్రలో జిల్లా కలెక్టర్
– గ్రామ ప్రజలతో రైతు వేదికలో ఏర్పాటుచేసిన గ్రామసభ
– పల్లె దవాఖానతో పాటు పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు
– స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన కలెక్టర్ హనుమంతరావు
రామన్నపేట, అక్షిత ప్రతినిధి :
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.మండలంలోని వెల్లంకి గ్రామంలో శుక్రవారం పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా రైతు వేదికలో గ్రామ ప్రజలతో కలిసి గ్రామ సభలో జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు. జెడ్పి సీఈవో శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో గ్రామస్తులు గ్రామంలో ఉన్న పలు సమస్యలు అందరి అధికారుల ముందు ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు. అందులో భాగంగా గ్రామంలో ఎప్పటినుండో నిర్మాణ దశలో ఉన్న పల్లె దవాఖాన,వెల్లంకి గ్రామం నుండి గుండ్రాంపల్లికి వెళ్లే రోడ్డు గుంతల మయమయిందని,గత 20 సంవత్సరాల కింద ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకోవడానికి ప్లాట్లు చేసి భూమి పట్టాలు ఇచ్చారని, అక్కడ ఇండ్లు నిర్మించుకోవడానికి మంచినీటి సౌకర్యం, డ్రైనేజీ, కరెంటు సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ను కోరారు.గ్రామంలో ఉన్న 3 చెరువులు కబ్జాకు గురవకుండా హద్దులు ఏర్పాటు చేసి చెరువు కట్టలు వేసి చెరువుల్లోని నీళ్లు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని,బస్సు సౌకర్యం కల్పించాలని,రామన్నపేట మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్న కమ్మునిటీ హెల్త్ సెంటర్ 30 పడకలుగా ఉందని ,100 పడకల ఆసుపత్రిగా మార్చాలని గ్రామస్థులు కోరారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… గ్రామంలో ఉన్న సమస్యలను రాసుకొని పరిష్కరించడం జరుగుతుందన్నారు.మా పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని సమస్యలను స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరిస్తానన్నారు. ఊరికి బస్సు సౌకర్యం లేదని గ్రామస్తులు కలెక్టర్ కి తెలిపారు. ఈ గ్రామానికి ఆర్టీసీ వాళ్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు చేరేలా చూడడం జరుగుతుందన్నారు. ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందామని కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, శిశు సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు, జిల్లా వైద్యాధికారి మనోహర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, తదితర నాయకులు,జిల్లా అధికారులు,సంబంధిత అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.