ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలి
* తేమశాతం 17 కంటే తక్కువ ఉండాలి
* తహసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ
* జిల్లా కలెక్టర్ హనుమంతరావు
వలిగొండ/ అక్షిత న్యూస్:
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.మంగళవారం రోజున వలిగొండ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలైన ఏదుళ్ళగూడెం,మందాపురం, నాతాళ్ల గూడెం, రెడ్ల రేపాక లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎంత ధాన్యం వచ్చిందని, ఎంత మేరకు కొనుగోలు చేయడం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని తేమ శాతాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులు ఎవరు కూడా దళారులను నమ్మి కష్టపడి పండించిన పంటని తక్కువ ధర కు అమ్ముకుని నష్టపోకూడదు అని అన్నారు.

ప్రభుత్వం రైతులకు అన్ని సౌకర్యాలు కలిపించిందని ధాన్యం కి మద్దతు ధర కూడా కల్పించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యం అమ్ముకోవాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఆన్లైన్ (ట్యాబ్ ఎంట్రీ) నమోదు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి అని తెలిపారు.కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న రైతులను ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఎట్టిపరిస్థితుల్లో కూడా ఏ ఒక్క రైతు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకొని నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని అన్నారు. రైతులు తెచ్చిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు అందేలా చూడాలని సంబంధిత అధికారులను సూచించారు..
తహసిల్దార్ కార్యాలయం తనిఖీ
అనంతరం వలిగొండ మండలంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు.

భూ సమస్యల సంబంధిత దరఖాస్తు లను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు.కుల ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులను పెండింగ్ లో లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జలంధర్ రెడ్డి, తాసిల్దార్ దశరథ, ఏవో అంజనీ దేవి, ఎంఆర్ఐ కరుణాకర్ రెడ్డి, ఏపిఎం అంజయ్య ఆయా గ్రామాల సెక్రటరీలు ఏఈవోలు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.