శివలింగ మాక్స్ సొసైటి 350 బస్తాల రైతుల ధాన్యం దోపిడి

శివలింగ మాక్స్ సొసైటి 350 బస్తాల రైతుల ధాన్యం దోపిడి

పంట పండించింది రైతులు లాభం నిర్వాహకులది

తూకంలో మోసం బస్తా ఒక్కంటికి 1కేజీ 500 నుండి 600 లు

లారీ ఒక్కంటికి 14 నుండి 15 బస్తాలు తరలింపు

నిర్వాహకులను మేము నమ్మడమే మా తప్పు

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రద్దు చేయాలని తహశీల్దార్ కు
వినతి పత్రం

నాగారం అక్షిత న్యూస్ :- రైతుల ధాన్యాన్ని దోపిడీ చేసి అక్రమాలకు పాల్పడ్డ డి.కొత్తపల్లి గ్రామానికి చెందిన శివలింగ మాక్స్ సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే రద్దు చేయాలని నాగారం తహశీల్దార్ హరి కిషోర్ శర్మ కు వినతిపత్రం సమర్పించిన డి. కొత్తపల్లి రైతులు. మంగళవారం ఈ సందర్భంగా డి. కొత్తపల్లి రైతాంగం మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు పేరుతో సెంటర్ నిర్వాహకులు మోసం చేసినట్లు వారు ఆరోపించారు. గ్రామంలో మహిళా సంఘాల సంఘ బంధం ఉండగా అధికార బలంతో సంఘ బంధానికి ధాన్యం కొనుగోలు కేంద్రం రానివ్వకుండా చేసి, శివలింగ మాక్స్ సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ధాన్యం తూకాల్లో భారీ అక్రమాలకు పాల్పడి, ధాన్యం కొనుగోలు పేరుతో బస్తాలను దోచుకుందని రైతులు ఆగ్రహంతో తెలిపారు. మా పంట అంటే మా ప్రాణం, వ్యవసాయ పొలంలో నట్ట నడుమ, ఎర్రటి ఎండల్లో కష్టపడ్డది మేమే. అలాంటి మా పంటను ఇలా లూటీ చేయడమంటే మా రైతుల గౌరవాన్ని అవమానించడం అని నిర్వాహకులపై రైతులు మండిపడ్డారు. ధాన్యం కాంటాపై తూకం వేస్తున్న సందర్భంలో 40 కిలోల బస్తా తూకం వేసే బదులు, అదనంగా బస్తా ఒక్కంటికి 1కిలో 500 నుండి 600 లు అదనపు తూకం బలవంతంగా పెట్టి, పతి లారీ లోడుకు 14 నుండి 15 బస్తాల ధాన్యాన్ని అదనంగా దోసుకున్నట్లు రైతులు స్పష్టం చేశారు. గత వేసవి కాలంలో శివలింగ మాక్స్ సొసైటీ కొనుగోలు కేంద్రం ద్వారా దాదాపు 45 లారీల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. ఇట్టి దోపిడీ పసిగట్టిన రైతులు దాదాపు 25 లారీల ధాన్యాన్ని మిల్లుల వద్ద తూకం ద్వారా తేల్చినట్టుగా తెలిపారు. మొత్తం దాదాపు 350 బస్తాల నిర్వాహకుల దోపిడి ధాన్యాన్ని కనుగొన్నట్లుగా రైతులు అన్నారు. ఒక్కో బస్తా వెనక మా కుటుంబాల, పిల్లల బతుకులు ఉన్నాయని వాపోయారు. మా ధాన్యాన్ని మీకు దోసే హక్కు ఎవరిచ్చారని రైతులు ఆవేదనతో తెలిపారు. ఇట్టి ధాన్యం దోపిడీ విషయంపై గతంలో స్థానిక తహశీల్దారు కు ఫిర్యాదు చేసిన ధాన్యాన్ని దోపిడీ చేసిన నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధపడ్డారు. 27-10-2025 సోమవారం రోజున సూర్యాపేట జిల్లా కేంద్రంలో గ్రీవెన్స్ డే లో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు రైతులు తెలిపారు. మళ్లీ 28-10-2025 మంగళవారం రోజున నాగారం తహశీల్దార్ కి వినతి పత్రం సమర్పించి తూకంలో మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, మా బస్తా ధాన్యం మా బ్రతుకు మాకు తిరిగి ఇవ్వాలని, స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. స్థానిక తహశీల్దార్ హరికిషోర్ శర్మ వెంటనే స్పందించి శివలింగ మాక్స్ సొసైటీ ధాన్యం కొనుగోలు సెంటరు పై తగు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని రైతులుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు యారాల నరసింహారెడ్డి, యానాల సుధాకర్ రెడ్డి, సంపేట కృష్ణమూర్తి, మాజీ ఉప సర్పంచ్ పెరుమాళ్ళ రవి, గ్రామ రైతులు తుక్కాని సోమేశ్వర్ రెడ్డి, దేవరకొండ వెంకన్న, దేవరకొండ యాదగిరి, నాతి ఉప్పలయ్య, కాసం వీరయ్య, వేర్పుల గట్టయ్య, వీరాచారి, కొండ నాగరాజు, కూదాటి పెద్ద లింగయ్య, కడారి సైదులు, కూతాటి లింగయ్య, పెరుమాళ్ళ జానీ, తుక్కాని లింగారెడ్డి, గైగుల్ల సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking