ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
భద్రాద్రి కొత్తగూడెం/ అక్షిత ప్రతినిధి :
మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి, పోక్సో స్పెషల్ జడ్జి సరిత మంగళవారం తీర్పు వెల్లడించారు.మణుగూరు మండలం వాగుమల్లారం గ్రామానికి చెందిన బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు 2024 జూన్ 12న మణుగూరు మండలం జానం పేటకు చెందిన గాడిద శ్రీనివాస్ మైనర్ బాలికపై అఘాయిత్యం చేశాడని మణుగూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా… ఇన్స్పెక్టర్ సతీష్ కేసు నమోదు చేశారు. అనంతరం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ బి. రవీందర్ రెడ్డి దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. విచారణలో 11 మంది సాక్షులను కోర్టు విచారించింది. వాదనలు, సాక్ష్యాదారాలు పరిశీలించిన న్యాయస్థానం… శ్రీనివాస్ పై నేరం రుజువైంది అని తేల్చింది. దీంతో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది.జరిమానా చెల్లించని యెడల అదనంగా మరో ఆరు నెలల కఠిన కారాగార శిక్షను అనుభవించాలని ఆదేశించింది. ఈ కేసు న్యాయపరమైన వాదనలను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలగల నాగిరెడ్డి నిర్వహించారు. కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్సై డి. రాఘవయ్య, లైజాన్ ఆఫీసర్లు సయ్యద్ అబ్దుల్ ఘని, అశోక్ సహకారం అందించినట్లు అధికారులు తెలిపారు.