విప్లవ అమరవీరులు
చిరంజీవులు
భూమి భుక్తి విముక్తి కోసం అమరుల త్యాగం యుగయుగాల స్ఫూర్తి
కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డి ప్రతిఘటన మార్గమే పేదలకు విముక్తి
విప్లవోద్యమ వారసత్వం కొనసాగించడమే అమరులకు నివాళి
ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బొడ్డు శంకర్
నాగారం, అక్షిత న్యూస్ :- భూమి, భుక్తి, విముక్తి కోసం త్యాగాల చాళ్లల్లో, విప్లవ ప్రతిఘటన రణ విముక్తి పోరు దారిలో నడిచిన విప్లవోద్యమ అమరవీరులకు మరణం లేదని, వారు చూపిన మార్గమే నేటి సామాజిక మార్పు సాధనకు, నూతన ప్రజాస్వామిక విప్లవ సాధనకు, దారి దీపమని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బొడ్డు శంకర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని డి. కొత్తపల్లి గ్రామ పరిధిలోని చంద్రారెడ్డి నగర్ లో ఉన్న అమరుడు కామ్రేడ్ యానాల చంద్రారెడ్డి స్థూపం వద్ద నవంబర్ 01నుండి 09 వరకు నిర్వహిస్తున్న అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, పేద ప్రజల హక్కుల కోసం, సమానత్వ సమాజం కోసం, గోదావరి లోయలో, మైదాన ప్రాంతాల్లో అమరులు చేసిన త్యాగాలు, యుగయుగాల పాటు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. నేటికీ విప్లవోద్యమ పోరాట బాట ఎంత కఠినమైనదైనా, ప్రజల కోసం వారి విముక్తి కోసం సాగిన,సాగే పోరాటం ఎన్నటికీ వృధా కాదని అన్నారు. నేటికీ కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి చూపిన ప్రతిఘటన మార్గంలో పేదలకు లక్షలాది ఎకరాల భూమిని పంచిపెట్టిన అమరులు పేదల ఆశా దీపాలని కొనియాడారు. నేటి దోపిడీ మార్గం రూపుమాపాలంటే ప్రతిఘటన పోరాటమే ప్రజలకు సరైన మార్గమని, ఆ మార్గంలో మనమంతా సంఘటితమై కదిలితేనే నిజమైన ప్రజాస్వామ్య స్థాపన సాధ్యమవుతుందని అన్నారు. నేటి పాలకవర్గాలు కార్పొరేట్ దోపిడీకి కట్టుబడి, రైతు కూలీల పేదల జీవితాలను బానిసలుగా మార్చేస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో విప్లవోద్యమ వారసత్వం కొనసాగించడం అత్యవసరమని, పల్లెల్లో, కార్మిక రంగంలో, విద్యార్థుల్లో ప్రజాస్వామిక చైతన్యం పెంపొందించడమే అమరవీరులకు నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి సంపెట కాశయ్య, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ గ్రామ కార్యదర్శి దందోలు ధనంజయ, నాయకులు కాసం వీరయ్య, పల్లెర్ల సోమన్న, పరిశాల సంజీవ్, అంకిరెడ్డి సైదులు, పెరమాల్ల జానీ, యాకయ్య, వంగూరి చంద్రం, ఏర్పుల మధు, దేవరకొండ ఎల్లయ్య, మల్లేష్, బుడతకాళ్ళ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.