పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసే తప్పుడు ప్రచారాలు మానండి
పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి
నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు ఇవ్వాలని ప్రజలకు సూచన
పోలీసులు సమాజ రక్షకులు వారికి గౌరవం ఇవ్వండి
నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగేశ్వరరావు
నాగారం అక్షిత న్యూస్ :- పోలీసుల ప్రతిష్టాన్ని కించపరిచే తప్పు ప్రచారం చేయవద్దని నాగారం సిఐ నాగేశ్వరరావు తెలిపారు. ప్రజల రక్షణ కోసం రాత్రింబవళ్లు, అహర్నిశలు సేవలందిస్తున్న పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు డిపార్ట్మెంట్ ప్రాణాలను ప్రాణంగా పెట్టి తమ కుటుంబాలను వదిలి ప్రజల భద్రతలు నిరంతరం కృషి చేస్తున్న పోలీసులు సమాజానికి రక్షకులని తెలిపారు. వారిని కించపరిచే తప్పుడు సమాచారం అసహ్యకరమైన పని అని అన్నారు. ఇటీవల అరవపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించి అలసిపోయిన ఎస్ఐ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, కొంతమంది వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగా వీడియో తీసి సోషల్ మీడియాలో తప్పుడు పద్ధతిలో ప్రచారం చేశారని తెలిపారు. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశంతో చేసిన ఈ చర్య పై, వీడియో చిత్రీకరించిన వారిపై, ప్రచారం చేసిన వారిపై, ప్రోత్సహించిన వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుగుతోందని తెలిపారు. జాజిరెడ్డిగూడెం, నాగారం, తిరుమలగిరి, పోలీస్ స్టేషన్ లు 24 గంటలు ప్రజాసేవలో పనిచేస్తున్నాయని అన్నారు. వర్షం, ఎండ, పగలు, రాత్రి తేడా లేకుండా పోలీస్ సిబ్బంది ప్రజల భద్రత కోసం కట్టుబడి పని చేస్తుందని తెలిపారు. అనారోగ్య పరిస్థితుల్లో కూడా కుటుంబాలకు దూరంగా ఉండి ప్రజాసేవలో నిమగ్నమవుతున్నారని అన్నారు. అదేవిధంగా, ఎవరైనా పోలీస్ కార్యాలయాల్లోకి వచ్చి భంగం కలిగించే చర్యలకు పాల్పడిన, తప్పుడు సమాచారాన్ని ఉద్దేశ్యపూర్వకంగా ప్రచారం చేసిన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ఎవరు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయాలని, ఎస్సై స్పందించకపోతే సీఐ, ఆ పై అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నానని, ఏదైనా సమాచారం ప్రచురించే ముందు సంబంధిత అధికారుల వద్ద నిజాలు తెలుసుకోవాలని, పోలీస్ శాఖ ప్రతిష్టకు బంధం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేయడం సమాజానికి హానికరమని తెలిపారు.