*నీటి కోసం కాలి బిందెలతో రోడ్డెక్కిన ప్రజలు*
– పుష్కలంగా వర్షాలు పడినా తప్పని నీటి కష్టాలు
– ఇప్పుడే ఇలా ఉంటే వేసవి కాలంలో మారేలా ఉంటుందో ?
మేడ్చల్, అక్షిత ప్రతినిధి :
తమకు నీరు కావాలని కాలి బిందెలతో ప్రజలు రోడ్డెక్కారు. అది ఎక్కడో కాదు అలియాబాద్ మున్సిపల్ కేంద్రంలోనే. వివరాల్లోకి వెళితే శామీర్ పేట్ మండల రెవిన్యూ పరిధి అలియాబాద్ మున్సిపల్ కేంద్రం లోని రామాలయం కాలనీలో గత మూడు రోజుల నుండి నీరు రావడం లేదని గురువారం కాలనీ వాసులు కాలి బిందెలతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. తమకు నీరు ఎందుకు వదలడం లేదని నీటి సరఫరా కార్మికుడికి ఫోన్ చేయగా పొంతనలేని సమాధానం చెప్తున్నారని మండిపడ్డారు. తమ కాలనీలో ఉన్న నీటి సమస్యపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్న పట్టించుకోవడం లేదన్నారు. చదువులకు, ఉద్యోగాలకు, ఇతరత్ర పనులకు వెళ్లాలంటే నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

ఇటీవల భారీ వర్షాలు కురిసి వాగులు, చెరువులు నిండుకున్నా నీటి సమస్య మాత్రం తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగా వర్షాకాలం కూడా అయిపోకుండానే ఇలా నీటి కష్టాలు వస్తే వేసవి కాలంలో పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని కాలనీ వాసులు అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. తమ కాలనీకి నీరు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.