అసఫ్ జాహీ రత్నాలు .. వరంగల్ మహిమ

అసఫ్ జాహీ రత్నాలు – వరంగల్ మహిమ” పుస్తక ఆవిష్కరణ

రచయిత కన్నెకంటి వెంకట రమణను అభినందించిన సీఎస్ 

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ రచించిన “అసఫ్ జాహీ రత్నాలు–వరంగల్ మహిమ” అనే అద్భుతమైన కాఫీ టేబుల్ పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి.ఎస్.రామకృష్ణరావు ఆవిష్కరించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్‌లో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సమాచార,పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సి.హెచ్. ప్రియాంక పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సి.ఎస్. రామకృష్ణరావు మాట్లాడుతూ“వరంగల్ చరిత్రలో అసఫ్ జాహీ కాలం ఒక ముఖ్యమైన అధ్యాయం. ఆ కాలంలో నిర్మితమైన అద్భుత కట్టడాలు, వారసత్వ భవనాలు,సాంస్కృతిక వైభవాన్ని ఈ పుస్తకం అద్భుతంగా ప్రతిబింబిస్తోంది.

చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి, పరిశోధకులకు, విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ అధికారి ఒకరు ఇంత చారిత్రక ప్రాధాన్యమున్న గ్రంథాన్ని వెలువరించడం గర్వకారణం” అన్నారు. వరంగల్ పేరు వినగానే మనసుకు వెంటనే వచ్చే కాకతీయుల వైభవం,వేయిస్తంభాల గుడి,ఖిలా వరంగల్, భద్రకాళి ఆలయం లాంటి స్మారక చిహ్నాల వెంట, ఈ పుస్తకం నిజాం నవాబుల హయాంలో నిర్మితమైన కాజిపేట రైల్వే స్టేషన్,ధర్మసాగర్ ఫిల్టర్ బెడ్, పలు అద్భుత భవనాలు, సుబాహ్‌గా ఉన్న వరంగల్ పరిధిలో పాలన చేసిన సుబేదారుల చరిత్ర వంటి ఎన్నో అరుదైన వివరాలను అందిస్తోంది.అసఫ్ జాహీ పాలనలో ఆదిలాబాద్,కరీంనగర్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలు వరంగల్ సుబాహ్ పరిధిలో ఉండేవి. ఈ ప్రాంతాల్లోని వారసత్వ భవనాలు,పాలకుల కృషి, ఆ కాలం నాటి పరిపాలనా ప్రత్యేకతలు, సాంస్కృతిక సంపదల గురించి ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించారు.“అసఫ్ జాహీ రత్నాలు –వరంగల్ మహిమ” పుస్తకంలో చారిత్రక భవనాల ఫోటోలు, పురావస్తు వివరాలు, సుబేదారుల చరిత్రలను సమన్వయపరుస్తూ ఒక చరిత్రాత్మక మణిహారాన్ని అందించారు. ఈ గ్రంథం చరిత్రప్రియులకు, విద్యార్థులకు, పరిశోధకులకు ఒక విలువైన మార్గదర్శకంగా నిలుస్తుంది.చారిత్రక విశేషాలను అందంగా సమకూర్చిన కన్నెకంటి వెంకట రమణను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి.ఎస్. రామకృష్ణరావు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking