డి. కొత్తపల్లిలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ విజయోత్సవ ర్యాలీ
అమరుల త్యాగాలకు నివాళిగా ఎర్రజెండా ఘన విజయం
అమరుడు యానాల చంద్రారెడ్డి స్ఫూర్తితో ప్రజా పాలన బాటలో డి. కొత్తపల్లి
గోదావరిలోయ పోరాట స్ఫూర్తితో మైదాన ప్రాంతంలో ప్రజా ఉద్యమాల పునర్జీవనం
పాలకులను ప్రశ్నించే ధైర్యమే డి. కొత్తపల్లి ప్రత్యేకత
నాగారం, అక్షిత న్యూస్ : డి. కొత్తపల్లి ఎర్రజెండా రాజకీయాలకు తిరుగులేని ముద్ర – ప్రజా ఉద్యమాల బాటలో కొనసాగుతున్న గ్రామ ప్రజాస్వామ్యం. మండల పరిధిలోని డి. కొత్తపల్లి గ్రామం మరోసారి ఎర్రజెండా రాజకీయాలకు అడ్డాగా నిలిచింది. సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ బలపరిచిన దోమలపల్లి సంధ్య గోవర్ధన్ గ్రామ సర్పంచ్ గా అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించడంతోపాటు, ఏడు వార్డులను కైవసం చేసుకోవడం, ఉప సర్పంచ్ పదవిని కూడా దక్కించుకోవడం ద్వారా గ్రామంలో ప్రజా ఉద్యమాల పట్ల ప్రజల అపారవిశ్వాసాన్ని స్పష్టంగా చాటింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకొని శనివారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ గ్రామ రాజకీయ చరిత్రలో మరో అధ్యాయంగా నిలిచింది. ఎర్ర జెండాలతో, విప్లవ గీతాలతో, ఎన్నికల విజయోత్సవంగా కాకుండా ప్రజా ఉద్యమాల పట్ల గ్రామ ప్రజల నిబద్ధతకు ప్రత్యేకగా మారింది. అమరుడు కామ్రేడ్ యానాల చంద్రారెడ్డి స్ఫూర్తితో ప్రజా సమస్యలను ప్రజా పోరాటాల ద్వారా అని సాధించుకోవాలన్న ఆలోచన తరతరాలుగా కొనసాగిస్తూ వస్తున్న డి. కొత్తపల్లి గ్రామం. నేటికీ అదే మార్గంలో పయనిస్తోంది. ఆయన అందించిన ఎర్రజెండా నీడలోనే గ్రామ ప్రజలు సంఘటతమై, పాలకులపై ప్రశ్నించే ధైర్యాన్ని హక్కుల కోసం పోరాడే స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. డి. కొత్తపల్లి గ్రామం కేవలం ఒక గ్రామంగా కాకుండా, ప్రజా ఉద్యమాల చరిత్రకు నిలువెత్తు ఉదాహరణగా మారింది. కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డి నిర్మించిన గోదావరి లోయ ప్రతిఘటన పోరాటం స్ఫూర్తితో మైదాన ప్రాంతంలో ప్రజా ఉద్యమాలను విస్తృతంగా పరిచిన విప్లవ వారసత్వం ఈ గ్రామంలో నేటికీ సజీవంగా ఉంది. అమరుల త్యాగాలు, ఉద్యమాల అనుభవాలు గ్రామ ప్రజల రాజకీయ చైతన్యాన్ని పదునెక్కించాయి. ఈ ఎన్నికల ఫలితాలు కేవలం గ్రామ పాలనలో మార్పును సూచించడమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రజా ఉద్యమాల ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో కార్పొరేట్ రాజకీయాలు పెరుగుతున్న ఈ రోజుల్లో, ప్రజలే పాలకులుగా నిలబడి ప్రజాప్రయోజనాల కోసం పాలన సాగించాలన్న ఆలోచనకు డి. కొత్తపల్లి విజయం బలమైన ఉదాహరణగా నిలిచింది. ప్రజల సమస్యలు, నీరు, రోడ్లు, భూములు, ఉపాధి, సామాజిక న్యాయం వంటి అంశాలపై రాజీలేని పోరాటమే తమ మార్గమని ఈ ఎన్నికల ద్వారా గ్రామ ప్రజలు మరోసారి స్పష్టం చేశారు. విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు మాట్లాడుతూ ఇది వ్యక్తిగత విజయం కాదని, ప్రజా ఉద్యమాల సమిష్టి గెలుపని, అమరుల ఆశయాలకు అంకితమైన విజయం అని తెలిపారు. ఎర్రజెండా కేవలం ఒక పార్టీ గుర్తు కాదని, అది ప్రజల హక్కుల కోసం సాగిన అనేక పోరాటాల చిహ్నమని అన్నారు. ప్రజల చేతుల్లోని పాలన ఉండాలన్న భావనను నేటికీ నిలబెడుతూ, డి. కొత్తపల్లి గ్రామం ఎర్రజెండా వెలుగులో ముందుకు సాగుతూ ఉండడం ప్రజాస్వామ్యానికి శుభ సూచకమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. డి. కొత్తపల్లి గ్రామంలో సాధించిన ఈ ఘనవిజయం ప్రజా ఉద్యమాల శక్తిని, అమరుల త్యాగాల విలువలను, ప్రజల ఐక్యతను మరోసారి నిరూపించింది. ఎర్రజెండా రాజకీయాలకు డి. కొత్తపల్లి గ్రామం నేటికీ దృఢమైన కంచుకోటగా నిలుస్తూ భవిష్యత్తులోనూ ప్రజా పోరాటాలకు దిశా నిర్దేశం చేయబోతుందన్న విశ్వాసాన్ని ఈ ఎన్నికల ఫలితాలు కలిగించాయి. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ వి. కోటేశ్వరరావు, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మాండారి డేవిడ్ కుమార్, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బొడ్డు శంకర్, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నల్గొండ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఇందూర్ సాగర్, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్ కుమార్, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కామ్రేడ్ సంపేట కాశయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకులు కామ్రేడ్ తడకమల్ల సంజీవ్, కామ్రేడ్ ఎర్ర ఉమేష్, జిల్లా నాయకులు కామ్రేడ్ గండు నగేష్, కామ్రేడ్ బొల్లె వెంకన్న, పిడిఎస్యు డివిజన్ అధ్యక్షులు భరత్, పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ యానాల సుధాకర్ రెడ్డి, పోతులూరి, భయ్యం లింగయ్య, జలగం లక్ష్మయ్య, నూతనంగా ఎన్నికైన ఉపసర్పంచ్ తో పాటు ఆరుగురు వార్డు సభ్యులు, గ్రామ సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.