జీ రాం జీ చట్టాన్ని రద్దు చేయాలని డి. కొత్తపల్లిలో గ్రామసభ
2005 ఉపాధి చట్టం కొనసాగించాలని ఏకగ్రీవ తీర్మానం
ఉపాధి హామీ చట్టం దయాదాక్షిణ్యo కాదు ప్రజల పోరాట ఫలితం
గాంధీ పేరుతో ఉన్న చట్టాన్ని చంపే ప్రయత్నం మతతత్వ కుట్ర
రైతులు కూలీలు ప్రజాసంఘాలు ఐక్య పోరాటానికి పిలుపు
ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బొడ్డు శంకర్
నాగారం అక్షిత న్యూస్ :- మండల పరిధిలోని డి. కొత్తపల్లి గ్రామంలో ఉపాధి హక్కును హరించే జీ రాం జీ చట్టాన్ని రద్దుచేసి, 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గ్రామసభను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దోమలపల్లి సంధ్య గోవర్ధన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ గ్రామసభలో ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బొడ్డు శంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీ రాం జీ చట్టం గ్రామీణ పేదల ఉపాధి హక్కును హరించే ప్రమాదకరమైన చట్టమని తీవ్రంగా విమర్శించారు. ప్రజల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సాధించుకున్న 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎవరో దయాదాక్షిన్యాల మీద వచ్చినది కాదని, పని అడిగితే పని ఇవ్వాల్సిందే అని బాధ్యతను ప్రభుత్వంపై మోపిన హక్కు ఆధారిత చట్టమని తెలిపారు. అలాంటి చట్టాన్ని రద్దుచేసి, కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా ఉపాధిని భిక్షలా మార్చే ప్రయత్నమే జీ రాం జీ చట్టమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు కూలీల జీవనాధారమైన ఉపాధి హామీ చట్టాన్ని కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం బిజెపి ప్రభుత్వం కూల్చివేస్తుందని ఆరోపించారు. రెండు రోజుల వ్యవధిలోని పేదల ఉపాధిపై, వారి జీవనంపై బుల్డోజర్ మోడల్ ను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని చంపి, మతతత్వ రంగు పులమటానికి జీ రాం జీ బిల్లును తీసుకురావడం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజుగా మిగిలిపోతుందని అన్నారు. గాడ్సే వారసులే ఈరోజు గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హక్కును కూడా అంతం అందించేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నాడు రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలపై రైతాంగ ఉద్యమం సాధించిన విజయాల స్ఫూర్తితో, నేడు జీ రాం జీ చట్టాన్ని రద్దు చేయించి, 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించుకునే వరకు రైతులు, వ్యవసాయ కార్మికులు, కూలీలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య వాద శక్తులు ఐక్యంగా పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు యానాల సుధాకర్ రెడ్డి, వార్డ్ మెంబర్లు రింగ్ శేఖర్, లింగమ్మ, సంజీవ, ఉప్పలయ్య గ్రామ ప్రజలు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం కూలీలు, తదితరులు పాల్గొన్నారు.