కేటీఆర్ కాదు…
కేఏపాల్
అసెంబ్లీ సాక్షిగా
అన్ని అబద్ధాలే…
నోరు తెరిస్తే
పచ్చి బూతులే…
ఉద్యమకారుల
బతుకులు బుగ్గిపాలు
మీ అరాచకాలను సమాధి చేసి ఫామ్ హౌస్ కు పరిమితం చేసినా బుద్ధి రాలే
షాద్ నగర్ ఎమ్మెల్యే
వీర్లపల్లి శంకర్
షాద్ నగర్, అక్షిత ప్రతినిధి :
మీ అరాచకాలను ఫామ్ హౌస్ కి పరిమితం చేసినా బుద్ధి రాలేదని, అబద్దాలతో నిత్యం ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బిఆర్ఎస్ నేతలపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ధ్వజమెత్తారు.కేటీఆర్ అయితే కేఏపాల్ ను తలపిస్తున్నారు.. ఒకవైపు అమ్మ పలుకు జగదంబ పలుకు అంటూ కవిత వీళ్ళ గుట్టు రట్టు చేస్తుంటే మరోవైపు అడ్డగోలు మాటలతో జనాల్లో చులకన అవుతున్నారు.. ఇది రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. ఇకనైనా పిచ్చి మాటలు మానుకోండి.. అంటూ వీర్లపల్లి శంకర్, స్థానిక ఉద్యమ కారులు మాజీ జెడ్పిటిసి వెంకటరామరెడ్డితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. కేటీఆర్ తో సహా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు తమ మాటలతో, తమ చేతలతో రాష్ట్రంలో ప్రజలు రాజకీయాలను అసహ్యించుకునే తరహాలో దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్యమ పార్టీ అని రంగంలోకి వచ్చి ఉద్యోగులు, కార్మికులు, జర్నలిస్టులు, విద్యార్థులు, సబండ వర్గాలందరినీ కలుపుకొని ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చాక అదంతా తమ ఘనకార్యమని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశించిన పదవి ఇవ్వలేదన్న కోపంతో బయటికి వచ్చి తెలంగాణ ప్రజల సెంటిమెంటును తన రాజకీయాల కోసం వాడుకున్నాడని ఆరోపించారు. తీరా అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మరిచిపోయి వాళ్ళ కుటుంబమే పదవులను అనుభవిస్తూ కాలక్షేపం చేసిందని, ఉద్యోగాలను, ప్రజా సమస్యలను, ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. శ్రీకాంతాచారి, కిష్టయ్య, యాదిరెడ్డి లాంటి ఎందరో ప్రాణ త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. కానీ అలాంటి కుటుంబాలను మరచిపోయి ఒకే కుటుంబం పదవులను అనుభవించిందని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో తమకు నష్టం జరుగుతుందని తెలిసిన సోనియాగాంధీ అడుగు వెనక్కి వేయకుండా తెలంగాణ ఇచ్చారని, తెలంగాణ ఇస్తే పదవులకు దూరంగా ఉంటానని మాట ఇచ్చిన కేసీఆర్ ఆ మాట తప్పి పదవుల కోసం పాకులాడాడని అన్నారు. అలాంటి వ్యక్తి తనను తాను తెలంగాణ జాతిపితగా చెప్పుకోవడం, బీఆర్ఎస్ నాయకులు భజన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. స్వపక్షంలోనే వ్యతిరేకత ఎదురు అయిన్నప్పటికీ కాంగ్రెస్ వెనకడుగు వేయకుండా తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు రాజకీయ వ్యభిచారానికి బీఆర్ఎస్ దిగజారింది అన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల ఆక్రమణలు, ప్రాజెక్టులలో అవినీతి వంటివి చేసి ప్రజలకు నీరు అందకుండా అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీ అని, ఆ నిజాలను కాంగ్రెస్ మాట్లాడితే బూతులకు దిగడం అలవాటుగా మారిందని అన్నారు. మాజీ మంత్రి కేసీఆర్ తన స్థాయిని మరిచి అడ్డగోలుగా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని చెప్పడం హాస్యాస్పదమని, అక్కడికి వెళ్లి చూస్తే తట్ట మట్టి ఎత్తిన దాఖలాలు కూడా కనిపించదని అన్నారు. తెలంగాణ భాష అంటూ అడ్డమైన బూతులు మాట్లాడి దిగజారి వ్యవహరిస్తే ఏదో ఒక రోజు అది మీకే చేటు తెస్తుందని చెప్పారు. సీఎం రేవంత్ వచ్చాకనే ఆంధ్ర ప్రాంతానికి నీటి తరలింపును ఆపారని అక్కడి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఒప్పుకున్న సంగతి గుర్తు చేశారు. కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావులు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి భాగవతాన్ని సాక్షాత్తు ఆ ఇంటి బిడ్డ కవిత బయట పెట్టడం పదేళ్ల వాళ్ళ అవినీతికి నిదర్శనం అని అన్నారు. ఇకనైనా దిగజారుడు స్థాయి మాటలను వదిలిపెట్టకుంటే తగిన బుద్ధి చెబుతామని ఎమ్మెల్యే హెచ్చరించారు.
పట్టించుకున్న
పాపాన పోలేదు
తెలంగాణ వచ్చాక తెలంగాణ ఉద్యమకారులను గాని, అమరవీరుల కుటుంబాలను బీఆర్ఎస్ ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని మాజీ జెడ్పిటిసి, తెలంగాణ ఉద్యమకారుడు పి. వెంకటరామిరెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉద్యమకారుల గురించి అసెంబ్లీలో మాట్లాడడంపై వారు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పోరాటంలో ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారని గుర్తు చేశారు. కాలం తర్వాత ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమకారుల ప్రస్తావన తేవడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని మభ్యపెట్టిన బీఆర్ఎస్ అన్నీ మరిచిపోయిందని అన్నారు. కేటీఆర్ భాష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెస్ అత్తయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు తగిన గౌరవం ఇచ్చేలా అసెంబ్లీలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడిన తీరు సంతోషకరమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే నిజమైన తెలంగాణ వచ్చిన భావన కలుగుతుందని అన్నారు. ఉద్యమకారులు జాంగారి రవి, జాంగారి నరసింహ, మంగులాల్ నాయక్, ఎమ్మే సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.