డి.కొత్తపల్లిలో గొర్రెలు మేకలకు బొబ్బరోగం టీకాల పంపిణీ
గాలి ద్వారా వ్యాప్తి చెందే బొబ్బరోగంపై అవగాహన
జ్వరం బొబ్బలు నోటిపుండ్లే బొబ్బ రోగ లక్షణాలు
వ్యాధి నివారణకు ముందస్తు టీకాలే ఉత్తమ మార్గం
జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డి.శ్రీనివాస్ రావు
నాగారం, అక్షిత న్యూస్ :-
మండల పరిధిలోని డి. కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలలో బొబ్బరోగం నివారణకు టీకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్. డి. శ్రీనివాస్ రావు, గ్రామ సర్పంచ్ దోమలపల్లి సంధ్య గోవర్ధన్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రెలు, మేకల పెంపకదారులకు బొబ్బరోగం వ్యాధిపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ వ్యాధి క్యాప్రి పాక్స్ వైరస్ వల్ల కలుగుతుందని, గాలి ద్వారా మందలోకి వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. వ్యాధి సోకిన జంతువులలో తీవ్రమైన జ్వరం, నోటిలో పుండ్లు రావడం, మేత మేయకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. అలాగే చర్మంపై వెంట్రుకలు లేని ప్రాంతాల్లో ముఖ్యంగా కండ్లు, తొడలు, పొదుగు, చెవుల దగ్గర బొబ్బలు ఏర్పడతాయని తెలిపారు. వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత బొబ్బల నుంచి చీము కారి అనంతరం మచ్చలు ఏర్పడతాయని, శరీరం లోపల శ్వాస కోశాలపై బొబ్బలు ఏర్పడి న్యుమోనియా వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ వ్యాధి సోకిన జంతువుల్లో శ్వాస కోస సంబంధిత ఇబ్బందులు, గర్భ స్రావం జరగడం, చివరికి గొర్రెలు మరియు మేకలు మృతి చెందే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. వ్యాధి సోకిన జంతువులకు వైద్యుల సూచన మేరకు యాంటీ బయోటిక్స్ తో పాటు జ్వరం, నొప్పి నివారణకు అవసరమైన ఇంజక్షన్లు వినియోగించాలని సూచించారు. బొబ్బరోగం రాకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందించే టీకాలను మూడు నెలల పైబడిన గొర్రెలు మరియు మేకలకు తప్పనిసరిగా వేయించాలని తెలిపారు. టీకాల ద్వారానే ఈ వ్యాధిని నియంత్రించవచ్చని, తద్వారా పశుసంపదను కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ బత్తుల రవి, పసునూరు జూనియర్ పశు వైద్యాధికారి నాగరాజు, ఫణిగిరి పశుసంవర్ధక సహాయకులు మురళి, నవీన్ మరియు రైతులు కాత కొమురయ్య, కాత నరేష్, భయ్యం అర్వపల్లి, బెల్లి వీరయ్య, పల్లెర్ల పరుశురాములు, లింగయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.