వరంగల్, అక్షిత బ్యూరో: విశ్వకర్మల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. వరంగల్ లోని కీర్తి గార్డెన్స్‌లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. విశ్వకర్మ భగవాన్ పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటీవల స్వర్గస్తులైన విశ్వబ్రాహ్మణులకు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ విశ్వకర్మలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామని వివరించారు. రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోజు బిక్షపతి చారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ కుల వృత్తులపై జరుగుతున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. వృత్తి భద్రత కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. 50 సంవత్సరాలు నిండిన విశ్వబ్రాహ్మణులకు పెన్షన్ కల్పించాలన్నారు. విశ్వబ్రాహ్మణ వృత్తికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి,పాలక మండలి నియామకం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మానుకోట మాజీ శాసనసభ్యులు బండి పుల్లయ్య, నౌండ్ల సంతోష్ చారి, నందిపేట రవీంద్ర చారి, తల్లోజు చెన్నయ్య చారి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శృంగారం భాస్కరాచారి,మాటూరు రమేష్ చారి,గుంటోజు పావని, పాములపర్తి వేణుగోపాల చారి బండోజు ఉపేంద్ర చారి, సతీష్ చారి, రాజన్న చారి,శ్రీనివాస చారి గోపాల చారి, భీమోజు సురేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.