ప్రతి బస్సు బస్టాండ్ లోకి వచ్చి వెళ్లాలి.! తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామెల్..
సూర్యాపేట, అక్షిత ప్రతినిధి : ఆర్టీసీ డిపోలకు సంబంధించిన ఏ బస్సులు అయినా తిరుమలగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ లోకి వచ్చి వెళ్లాలని తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామెల్ అన్నారు.సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గంలోని తిరుమలగిరి పాత గ్రామంలో ఉన్న బస్ స్టాండ్ ని ఆయన సూర్యాపేట డిపో మేనేజర్ ఊటుకూరి సునీతతో కలిసి పునః ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవలి కాలంలో తిరుమలగిరి నుండి వచ్చి వెళ్తున్న బస్సులు బస్టాండు లోనికి రాకపోవడంతో నిరుపయోగంగా మారిందన్నారు. ఇట్టి బస్టాండ్ ని నేడు ఉపయోగంలోకి తీసుకొచ్చి అన్ని డిపోలకు చెందిన బస్సులు వచ్చి పోయే విధంగా ఉండాలని కోరారు. దినదినాభివృద్ధి చెందుతున్న తిరుమలగిరి ఎక్స్ రోడ్డు నుండే అన్ని బస్ సర్వీసులు హైదరాబాద్ కు వెళ్తున్నాయని, అలా కాకుండా ప్రతి బస్సు పాత గ్రామంలో ఉన్న బస్టాండ్ లోకి వచ్చి వెళ్లాలని సూచించారు. బస్టాండ్ లో కావలసిన మౌలిక వసతులను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ప్రయాణికులకు బస్సు డ్రైవర్, కండక్టర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్టాండ్ లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.బస్టాండ్ ఆవరణలోనే మూత్రశాలలు ఉన్నాయని, వాటిని రిపేరు చేయించి ప్రయాణికులు వాడుకునే విధంగా ఏర్పాటు చేయాలన్నారు.బస్టాండ్ పక్కన కావలసిన దుకాణాలు ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్ సునీతకి తెలిపారు.త్వరలోనే పాత గ్రామానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని,ప్రతి బస్సు వచ్చి పోయేలాగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. తిరుమలగిరి నుండి సూర్యాపేట వరకు నూతన బస్సును ప్రారంభించి పాత గ్రామం బస్టాండ్ నుండి తిరుమలగిరి ఎక్స్ రోడ్ వరకు ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వై.నరేష్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సుంకరి జనార్ధన్,జిల్లా అధికార ప్రతినిధి సంకేపల్లి కొండల్ రెడ్డి, తిరుమలగిరి మండలం కార్యనిర్మాణ అధ్యక్షులు జమ్మిలాల్ ,తిరుమలగిరి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మూల అశోక్ రెడ్డి,తిరుమలగిరి మున్సిపాలిటీ అధ్యక్షులు పేరాల వీరేష్,కందుకూరి లక్ష్మయ్య, బత్తుల శ్రీనివాస్,నవీన్,చారి, రాము,యాదగిరి,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
