గ్రామాల ఆత్మీయతకు స్వరం పేరాల దయానంద్ పాట సిడి ఆవిష్కరణ
పల్లె సంస్కృతి కళ్ల ముందు నిలబెట్టిన “నాపల్లె తల్లి ఈటూరు రో”
పాట వింటే ఈటూరు గ్రామమే కళ్ళ ముందు కనిపిస్తుంది
తెలంగాణ ఉద్యమ గాయకులకు తగిన గౌరవం కల్పించాలి
పేద కళాకారులకు ప్రభుత్వం సమాజం అండగా నిలవాలి
కళాకారులకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది
శాసనమండలి సభ్యులు ప్రముఖ మేధావి ప్రొఫెసర్ కోదండరాం
నాగారం, అక్షిత న్యూస్ :– పల్లెటూర్లలో కనిపించే ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మనుషుల మధ్య ఉండే అనుబంధమే గ్రామాల అసలైన గొప్పతనమని, ఆ గొప్పతనం ప్రజా గాయకుడు పేరాల దయానంద్ రచించి ఆలపించిన పాటలో హృద్యంగా ప్రతిఫలించిందని శాసనమండలి సభ్యులు, ప్రముఖ మేధావి ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. గ్రామ జీవన సంస్కృతిని కళ్ళ ముందు నిలబెట్టేలా ఈ పాట ఉండడం విశేషమని ఆయన అభినందించారు. మండల పరిధిలోని ఈటూరు గ్రామానికి చెందిన ప్రజా గాయకుడు, పాటల రచయిత పేరాల దయానంద్ తన పుట్టిన ఊరు, పెరిగిన నేల అయిన ఈటూరు గ్రామం పై రచించిన “నా పల్లె తల్లి ఈటూరు రో”అనే గీతం సిడిని సోమవారం హైదరాబాద్ నారాయణగూడ లోని భారత్ విద్యాసంస్థల్లో ఎమ్మెల్సీ కోదండరాం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాట గ్రామాల జీవనశైలిని, మనుషుల మధ్య ఉండే ఆత్మీయతను అద్భుతంగా ఆవిష్కరిస్తుందని అన్నారు. పాటలు వింటూ, చూస్తూ ఉన్నంతసేపు ఈటూరు గ్రామం కళ్ళ ముందు కట్టినట్టుగా కనిపిస్తుందని తెలిపారు. గ్రామాలు కేవలం భౌగోళిక ప్రాంతాలు మాత్రమే కాకుండా, మన సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమని, అలాంటి గ్రామాల గొప్పతనాన్ని ప్రజా గాయకులు తమ పాటల ద్వారా తరతరాలకు అందిస్తున్నారని అన్నారు. ఈ పాట రూపకల్పనకు సహకరించిన భారత్ విద్యాసంస్థల చైర్మన్ చింత రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామాల్లో అపార ప్రతిభ ఉన్న కళాకారులు సరైన గుర్తింపుకు నోచుకోకుండా ఉండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులను చిన్నచూపు చూసే ధోరణి సమాజంలో ఇంకా కొనసాగుతుండడం బాధాకరమని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తమ స్వరాలను ఆయుధాలుగా మార్చుకొని ఎవరి పోరాటం చేసిన కళాకారులకు తగిన గౌరవం, గుర్తింపు దక్కాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అలాంటి కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి, సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంతి ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ పేద కళాకారులకు సమాజం, ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం అంతాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించే ఇలాంటి మరెన్నో పాటలు నేరాల దయానంద్ రహించి ప్రజల్లోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భారత్ విద్యాసంస్థల చైర్మన్ చింత రెడ్డి వేణుగోపాల్ రెడ్డి, ప్రజా గాయకుడు మరియు పాటల రచయిత పేరాల దయానంద్, ప్రొఫెసర్ నరసింహ రెడ్డి, కన్నీగంటి రవి, నాగయ్య, ఈటూరు గ్రామవాసులు బోడ పరుశురాములు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు పేరాల గోపి, బోడ అశోక్, వంగూరి శోభన్ బాబు, బోడ కళ్యాణ్, స్వామి, వంగూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.