రూ. 2లకే కిలో బియ్యం..

  • రూ. 2లకే కిలో బియ్యం..
  • ఆ ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది
  • టిడిపి రామన్నపేట మండల నాయకులు ఎం ఫజల్, బత్తుల సత్తయ్య 
  • రామన్నపేట పట్టణంలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి

రామన్నపేట, అక్షిత ప్రతినిధి: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు , పేదల పెన్నిధి , బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి , స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను రామన్నపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రామన్నపేట పట్టణంలో ఏరియా హాస్పిటల్ లో ఉన్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టిడిపి రామన్నపేట మండల నాయకులు ఎం ఫజల్ బత్తుల సత్తయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే పేదలకు స్వేచ్ఛ స్వతంత్యాలు లభించాయన్నారు. ఎన్టీఆర్.. తెదేపాను ప్రాంతీయ పార్టీగా స్థాపించిన అనతికాలంలోని ప్రజలకు చేరువై ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రూ. 2లకే కిలా బియ్యం అందించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీ వెనుకబడిన వర్గాల వారికి రాజకీయాలలో అవకాశాలు కల్పించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం ఒక చరిత్ర అయితే , తన పాలన దక్షతతో అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించి పేదల దేవుడుగా ఎన్టీఆర్ కీర్తించబడ్డాడన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం , మండల వ్యవస్థ ఏర్పాటు చేయడం , ఆడపిల్లకు ఆస్తిలో సమాన హక్కు చట్టాన్ని తీసుకురావడం లాంటి పథకాలు నేటికీ కొనసాగుతూ ఉన్నాయంటే అదే ఎన్టీఆర్ గొప్పతనం అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని , తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోచబోయిన మల్లేశం, ఉప్పల ప్రభాకర్, ఉప్పల సత్యనారాయణ, గంజి వీరయ్య, కట్ట మహేందర్, ఎండి సువియాన్, లింగస్వామి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking