రాజకీయాలకతీతంగా గ్రామ అభివృద్దే లక్ష్యం

లక్ష్మాపురంలో తొలి గ్రామపంచాయతీ సమావేశం

రాజకీయాలకతీతంగా గ్రామ అభివృద్దే లక్ష్యం

ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయం

వార్డు సభ్యుల సూచనల సమస్యలకు ప్రాధాన్యత

ప్రతి నిర్ణయం గ్రామ ప్రయోజనాల కోసమే

ప్రజల భాగస్వామ్యంతోనే సమగ్ర గ్రామ అభివృద్ధి సాధ్యం

లక్ష్మాపురం గ్రామ సర్పంచ్ గుగులోతు రవీందర్ నాయక్

గ్రామ పంచాయతీ కార్యదర్శి బి. గోపి

నాగారం, అక్షిత న్యూస్ :- ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధినే ఏకైక లక్ష్యంగా తీసుకొని అగ్ర గ్రామిగా పనిచేస్తామని లక్ష్మాపురం గ్రామ సర్పంచ్ గుగులోతు రవీందర్ నాయక్ స్పష్టం చేశారు. మండల పరిధిలోని లక్ష్మాపురం గ్రామపంచాయతీలో నూతనంగా ఏర్పడిన పాలనలో భాగంగా నిర్వహించిన తొలి సమావేశం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ అత్యంత పకడ్బందీగా, అర్థవంతంగా సాగింది. గ్రామ సర్పంచ్ గుగులోతు రవీందర్ నాయక్ అధ్యక్షతన, పంచాయితీ కార్యదర్శి బి. గోపి ఆధ్వర్యంలో తొలి సమావేశం గ్రామాభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. గ్రామంలోని వార్డు సభ్యులు, హాజరై తమ తమ వార్డుల్లో ఉన్న సమస్యలు, అవసరాలు, సూచనలు, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుగులోతు రవీందర్ నాయక్ మాట్లాడుతూ గ్రామ ప్రజల విశ్వాసంతో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన మనమంతా వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి గ్రామ అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని ఎనిమిది వార్డుల్లో ఉన్న ప్రతి సమస్యను గుర్తించి, తమ పదవీకాలంలోనే పరిష్కరించుకునే దిశగా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతామని తెలిపారు. గ్రామంలో ప్రధానంగా ఎదురవుతున్న మంచినీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ లోపాలు, రోడ్ల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, పచ్చదనం పెంపు, చెత్త నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి వార్డులోని సమస్యలను ఆయా అవార్డు సభ్యుల ద్వారా గాని, నేరుగా సర్పంచ్ దృష్టికి తీసుకురావాలని గ్రామ ప్రజలను కోరారు. గ్రామాభివృద్ధి విషయంలో రాజకీయాలకు చోటు లేదని, పార్టీలకతీతంగా అందరు సమిష్టిగా కృషి చేసినప్పుడే గ్రామం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు మనపై ఇచ్చిన నమ్మకాన్ని వమ్మ చేయకుండా, ప్రతి నిర్ణయం గ్రామ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటామని తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో పారదర్శకత పాటిస్తామని ప్రజల అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ గ్రామపంచాయతీ కార్యదర్శి బి. గోపి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామపంచాయతీ సమావేశంలో వచ్చిన సమస్యలు, ప్రతిపాదనలను అధికారికంగా నమోదుచేసి సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. గ్రామంలో పారిశుధ్యం పై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని, పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని సూచించారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ప్రజల సహకారంతోనే సమర్థవంతమైన పాలకమండలి పరిపాలన సాధ్యమవు తుందని తెలిపారు. తొలి గ్రామపంచాయతీ సమావేశం భవిష్యత్తు అభివృద్ధికి స్పష్టమైన దిశా నిర్దేశం చేసిందని పలువురు గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. మొత్తంగా లక్ష్మాపురం గ్రామంలో నిర్వహించిన ఈ తొలి గ్రామపంచాయతీ సమావేశం ప్రజాస్వామ్య పాలనకు నిదర్శనంగా నిలిచిందని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ముందుకు సాగేందుకు ఇది దోహద పడిందని గ్రామస్తులు ప్రశంసించారు. గ్రామాభివృద్ధి దిశగా ఈ గ్రామసభ ఒక కీలకమైన మైలురాయిగా నిలిచిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గండెల లలిత, వార్డ్ మెంబర్లు మల్లెపాక వెంకటయ్య, తడకమళ్ళ శృతి, గుగులోతు నీలమ్మ, జాటోత్ దయాకర్, శాగంటి వీరభద్రయ్య, సుంకరి భద్రమ్మ, సుంకరి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking