- ఆర్థిక కష్టాల నడుమ కుటుంబంలో విషాదం
- కూతురు హత్య, కుటుంబ ఆత్మహత్యాయత్నం
అక్షిత న్యూస్, గాజులరామరం : ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడితో తీవ్రంగా కుంగిపోయిన జగద్గిరిగుట్ట విజయనగర్ కాలనీలోని ఒకే కుటుంబం విషాదకర నిర్ణయానికి దిగిన ఘటన స్థానికులను కలచివేసింది. వివరాల ప్రకారం, సతీష్ కుమార్, అతని భార్య, కుమారుడు నితిన్ కుమార్ మరియు కూతురు శ్రీ జావలి (18) కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో పుట్టుకతో వికలాంగురాలైన కూతురి భవిష్యత్‌పై తీవ్ర ఆందోళనకు లోనైన కుటుంబం రెండు రోజుల క్రితం ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కూతురు మృతి చెందిన అనంతరం కుటుంబ సభ్యులు రెండు రోజులపాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకొని గడిపినట్లు తెలుస్తోంది. అనంతరం తీవ్ర మనస్థాపానికి గురైన భర్త, భార్య, కుమారుడు చేతులు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే 48 గంటలు గడిచినా మరణం సంభవించకపోవడంతో కుమారుడు నితిన్ తన స్నేహితునికి సమాచారం అందించాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న మిగిలిన కుటుంబ సభ్యులను చికిత్స నిమిత్తం కూకట్పల్లి రాందేవ్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు సంఘటనపై విచారణ మొదలుపెట్టారు .