మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థులను సర్వే ఆధారంగా ఎంపిక చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి, నల్గొండ జిల్లా ఇన్చార్జి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పార్టీ బలంగా ఉంటే మనం బలంగా ఉంటామని, మిర్యాలగూడ మున్సిపాలిటీలోని 48 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించి సత్తా చాటాలన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా అందరికీ అందుబాటులో ఉంటానని, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరూ కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ మిర్యాలగూడ మున్సిపాలిటీ 48 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు గెలుపు కోసం మూడు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి వార్డుకు 10 మంది చొప్పున 480 మందిని నియమించామని వారందరూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను, సన్న బియ్యం రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి ఇంటికి వెళ్లి వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తారని ఆయన తెలిపారు. 48 వార్డులు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నారు. సమావేశంలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, సీనియర్ నాయకులు చిరుమర్రి కృష్ణయ్య పగిడి రామలింగయ్య యాదవ్, మహబూబ్ అలీ, దిరావత్ స్కైలాబ్నాయక్, గాయం ఉపేందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, తలకొప్పుల సైదులు, గుడిపాటి నవీన్, ముదిరెడ్డి నర్సిరెడ్డి, దేశిడి శేఖర్ రెడ్డి, షేక్ అబ్దుల్లా, మోయీజ్, కోల వెంకన్న ముదిరాజ్ పాల్గొన్నారు.
