ప్రజల పక్షాన ప్రశ్నించే
గొంతుక అవుతాం
ప్రజలకు ఉత్తమ సేవలు
అందించడమే మా ఎజెండా
డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్
వనపర్తి, అక్షిత ప్రతినిధి :
మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీ పొలిటికల్ జెఎసి బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల పక్షాన సమస్యలపై ప్రశ్నించే గొంతుక అవుతారని, ప్రజలకు ఉత్తమ సేవలు అందించడమే మా ఎజెండా అని జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 3వ వార్డు నుంచి బీసీ పొలిటికల్ జెఎసి కౌన్సిలర్ అభ్యర్థిగా దేవర శివ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పాత బజార్ నుంచి బిసి పొలిటికల్ జేఏసీ నాయకులు వార్డు ప్రజలతో కలిసి భారీ ర్యాలీతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా పట్టణంలో ప్రజలకు విద్య, వైద్యంతో పాటు ఏ సమస్య వచ్చినా బీసీ పొలిటికల్ జేఏసీ ముందు వరుసలో ఉండి సమస్యల పరిష్కారానికి పోరాటం సాగించిందన్నారు. గత మున్సిపల్ కౌన్సిల్ లో అన్ని పార్టీల కౌన్సిలర్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టడంతో పాటు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. బీసీ పొలిటికల్ జేఏసీ చేసిన పోరాట ఫలితమే నేడు పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు మళ్లీ మొదలయ్యాయని, అలాంటి మాకు ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపొందిన తర్వాత వారి వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటారు కానీ, బీసీ పొలిటికల్ జేఏసీ మాత్రం అలా కాదన్నారు. మొదటగా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేసిన తర్వాతే ఎన్నికల బరిలో నిలుస్తూ రాజకీయంగా ముందుకు వస్తున్నామన్నారు. మూడో వార్డు తరఫున బరిలో ఉన్న బీసీ పొలిటికల్ జేఏసీ పట్టణ అధ్యక్షుడు దేవర శివను ప్రజలు ఆశీర్వదిస్తే కౌన్సిలర్ గానే కాకుండా ఉన్నత స్థానంలో ఉండి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో, మంత్రులతో, స్థానిక ఎమ్మెల్యేలతో బీసీ పొలిటికల్ జేఏసీకి ఉన్న అనుబంధాన్ని ఉపయోగించి పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు వివి గౌడ్, ధర్మేంద్ర సాగర్, నారాయణ సాగర్, నాగరాజు, నరేందర్ సాగర్, యశ్వంత్ గౌడ్, పేట శివ యాదవ్, రాజోలి సురేష్, మహబూబ్, చాంద్ పాషా, బాలగౌడ్ తదితరులు పాల్గొన్నారు