కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీ కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి
మహబూబ్ నగర్, అక్షిత న్యూస్:
త్వరలో జరగబోవు కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని బీసీ కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనీ బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి.రహదారులు మరియు భవనముల శాఖ ప్రాంగణంలో బీసీ జేఏసీ రైట్స్ స్టేట్ కన్వీనర్ సారంగి లక్ష్మీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ అన్ని బీసీ కుల సంఘాలు, సంఘాల పోరాటాల ఫలితంగానే మహబూబ్ నగర్ మేయర్ గా బీసీలకు అవకాశం దక్కిందని అదే తరహాలో అన్ని కులాలకు జనాభా దామాషా ప్రకారం కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించి అలాగే
తొలి ఉప మేయర్ గా కూడా దళితులకు కేటాయించాలని అన్నారు. బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం పేరుతో దేశవ్యాప్త పర్యటన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ లోఎందుకు బీసీలకు కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత కల్పించలేదని అందుకు తగిన గుణపాఠం ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో చూపెడతామని అన్ని జనరల్ స్థానాలలో పార్టీలకతీతంగా బీసీ నాయకులను గెలిపించుకొని తీరుతామన్నారు. కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో కుమ్మరి కులానికి ఎలాంటి ప్రాతినిధ్యం దక్కలేదని కార్పొరేషన్ పదవుల్లో అయినా తమ కులానికి ప్రాధాన్యత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత డిఇఓ విజయ్ కుమార్, నాయి బ్రాహ్మణ సేవా సమితి పట్టణ అధ్యక్షుడు అశ్విని సత్యం, మేదరి సంఘం కార్యదర్శి ఆంజనేయులు, ఎమ్మార్పీఎస్ నాయకుడు సింగిరెడ్డి పరమేశ్వర్, నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు