ఎడమ కాల్వలో కారు పడ్డ ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ పవార్
*రెండో మృతదేహనికై బృందాల గాలింపు
ఎస్పీ పవార్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో శనివారం రాత్రి కారు అదుపుతప్పి పడిపోయిన సంఘటనపై రెవెన్యూ, పోలీస్, ఫైర్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం అయన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి ముకుందాపురం వద్ద సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. సంఘటన జరగడానికి గల కారణాలను, కారు ప్రమాద సంఘటనలో చనిపోయిన వారి వివరాలను, ఇతర వివరాలను స్థానికులు, అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఇదే విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో నల్గొండ జిల్లా, త్రిపురారం మండలం కంపసాగర్ గ్రామానికి చెందిన భార్యా భర్తలు తల్లం పుల్లయ్య, పద్మలు ప్రయాణిస్తున్న కారు ముకుందాపురం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో ఆదుపుతప్పి పడిపోవడం జరిగిందని, విషయం తెలిసిన వెంటనే రెవిన్యూ, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ళు, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలాన్ని చేరుకొని గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే రాత్రి సమయమైనందున కారును వెంటనే బయటకు తీయలేకపోవడం జరిగిందని, ఆదివారం ఉదయం రెస్క్యూ బృందాలు కారును బయటికి తీశాయని, అలాగే ప్రమాదంలో మృతి చెందిన పద్మ మృతదేహం లభ్యం కాగా భర్త పుల్లయ్య మృతదేహం దొరకాల్సి ఉందని, అన్ని బృందాలు ఆదివారం ఉదయం నుండి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

అన్ని శాఖల సమన్వయంతో గల్లంతైన పుల్లయ్య మృతదేహాన్ని వెలికి తీస్తామని, ఈ సంఘటనలో ఎన్డిఆర్ఎఫ్ బృందం కూడ తమతో సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ శనివారం రాత్రి 7:30సమయంలో ముకుందాపురం వద్ద సాగర్ కాల్వలో కారు అదుపుతప్పి పడిపోయిన సంఘటనలో రెవెన్యూ, పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని కారును వెంటనే గుర్తించిన చీకటి కారణంగా శనివారం వెలికితీయలేకపోయామని, ఆదివారం ఉదయమే కారును బయటకు తీయడం జరిగిందని, అలాగే చనిపోయిన మహిళ మృతదేహాన్ని కూడా వెలికి తీశామని, అన్ని శాఖల సమన్వయం, సహకారంతో గల్లంతైన పుల్లయ్య మృతదేహాన్ని కూడా వెలికి తీస్తామన్నారు. రెవిన్యూ ఆదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి, మిర్యాలగూడ డిఎస్పి కె.రాజశేఖర్ రాజు, స్థానిక రెవెన్యూ,పోలీస్, ఇతర అధికారులున్నారు.