విద్యతోనే వెలుగు… బీసీ విద్యార్థులకు దిశానిర్దేశం
వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ప్రేరణ తరగతులు ప్రారంభం
కలెక్టర్ జితేష్. వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, అక్షిత ప్రతినిధి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న 200 మంది పదో తరగతి విద్యార్థినీ,విద్యార్థులకు పరీక్షలపై ప్రేరణ మరియు అవగాహన తరగతులు శనివారం కొత్తగూడెంలోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జితేష్. వి. పాటిల్, జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షలంటే భయం అవసరం లేదని, మార్కులు సాధించడమే కాదు జీవితంలో గెలిచి చూపించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నిరంతర శ్రమ ఉంటే 100 శాతం ఫలితాలు సాధ్యమని తెలిపారు.వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి ప్రేరణ తరగతులు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొంటూ, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అధికారులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పి. విజయలక్ష్మి మాట్లాడుతూ, వసతి గృహాల్లోని ప్రతి విద్యార్థి 100 శాతం ఫలితాలు సాధించేలా శాఖ తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, వసతి గృహాల సిబ్బంది పాల్గొన్నారు.