ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి చర్యలు

ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి చర్యలు

రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద

మందమర్రి, అక్షిత ప్రతినిధి :

ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. శుక్రవారం జిల్లాలోని చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్ పర్సన్ నాయకపు వినయ్ కుమార్, 3వ వార్డు కౌన్సిలర్ అంబటి శంకర్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. మార్చి 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు వరకు 99 రోజుల కార్యచరణ రూపొందించడం జరిగిందని, గ్రామస్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి లలో అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని, ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న పైళ్ల క్లియరెన్స్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి దశల వారీగా పూర్తి చేయడం జరుగుతుందని, వేసవి దృష్ట్యా త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయలు తీసుకుంటామని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో ప్రజల సౌకర్యార్థం సి సి రోడ్లు, మరుగు కాలువలు, త్రాగునీటి కొరకు బోర్ వెల్ లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డుకు 15 లక్షల రూపాయల చొప్పున అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆయా వార్డులలో నెలకొన్న సమస్యలపై పూర్తి వివరాలతో నివేదిక రూపొందించి సమర్పించాలని తెలిపారు. శంకుస్థాపన చేసిన కార్యక్రమాల పనులను ప్రారంభించి నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, ప్రజల సమస్యలను ఓపికగా ఆలకించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కొరకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, మహిళల ఆర్థిక అభివృద్ధ దిశగా రుణ సదుపాయం కల్పించి ప్రోత్సహించడం జరుగుతుందని, అర్హత గల మహిళలకు వచ్చే విడతలో ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల కార్యక్రమంలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని, వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నగర అభివృద్ధి, డి ఎం ఎఫ్ టి, సి ఎస్ ఆర్ నిధుల ద్వారా చెన్నూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసి మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలను భాగస్వామ్యులను చేయడం జరుగుతుందని, పారిశుధ్య నిర్వహణలో భాగంగా ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించడం జరుగుతుందని, ఉపయోగకరమైన చెత్తను వేరుచేసి సెగ్రిగేషన్ షెడ్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు. సి సి రోడ్లు, మురుగు కాలువల పనులను వేగవంతం చేస్తామని, చెన్నూర్ లో చేపట్టిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అందరిచే ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక ప్రతిజ్ఞ చేయించారు.చెన్నూర్ పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్ లో 50 లక్షల రూపాయల నిధులతో ఫంక్షన్ హాల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking