వైద్య విద్య అభివృద్ధికి సకల సదుపాయాలు
పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ
మందమర్రి, అక్షిత ప్రతినిధి :
ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలలో వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల కొరకు సకల సదుపాయాలు కల్పించడం జరుగుతుందని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట ప్రాంతంలో గల ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల కొరకు ఏర్పాటుచేసిన బస్సులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ లు రేఖ, జగతీ దేవి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఎం.పి. నిధుల నుండి 2 బస్సులు, డి. ఎం. ఎఫ్. టి. నిధుల నుండి 1 బస్సు మొత్తం 80 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చి వైద్య విద్య అభ్యసిస్తున్నారని, వైద్య విద్య అనేది ప్రత్యేకమైనదని తెలిపారు. చదువుకోవడం అనేది ప్రతి ఒక్కరి హక్కు అని, ఉన్నత చదువులు అభ్యసించి ఆదర్శంగా నిలవాలని, ఉన్నత స్థాయిలో ప్రజలకు సేవ అందించడం బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు.

గడిచిన 2 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని రామగుండం, బెల్లంపల్లి, రేచిని ఇతర ప్రాంతాలలో ఓవర్ బ్రిడ్జిలు, ఇతర అభివృద్ధి కొరకు అనుమతులు పొంది పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. రైల్వే స్టేషన్లను ఆధునికరిస్తూ అనేక చర్యలు చేపట్టడం జరుగుతుందని, మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలు నిలుపడం ద్వారా రైల్వే శాఖకు ఈ ప్రాంతం నుండి అధిక ఆదాయాన్ని సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. విద్యారంగాన్ని పటిష్టపరిచి అన్ని ప్రభుత్వ పాఠశాలలలో సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, విద్యార్థులు ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో చదివి దేశంలో మంచిర్యాల ప్రాంతానికి గుర్తింపు తీసుకురావాలని, ఇందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తామని తెలిపారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతాయని, తద్వారా చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని, విద్యార్థుల కొరకు త్వరలోనే స్పోర్ట్స్ కిట్లను అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాల కొరకు నూతన శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దాదాపు 1 వేయి మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారని తెలిపారు. వైద్య విద్య కొరకు అవసరమైన తరగతి గదులు, ల్యాబ్, మెటీరియల్, ఫ్యాకల్టీ ఇతర అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని, విద్యార్థులకు అవసరమైన బస్సులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇటీవల వరుసగా జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల కారణంగా ఆలస్యం జరిగిందని అన్నారు. ప్రభుత్వం నుండి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మితమవుతున్న ప్రభుత్వ ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వైద్య విద్య ఎంతో ఖర్చుతో కూడుకుందని, అర్హత గల విద్యార్థులకు ప్రభుత్వం విద్య అందిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య విద్యను పూర్తి చేసి సమాజానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల హెచ్ ఓ డి శ్రీకాంత్, ఎ. డి. తులసీదేవి, డి సి సి ప్రతినిధి రఘునాథ్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.