విలువలతో కూడిన జర్నలిజo అవశ్యం
ఎంఎస్. ఆచార్య విగ్రహావిష్కరణ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
హైదరాబాద్ లోని గోపనపల్లి జర్నలిస్ట్ కాలనీలో స్వాతంత్ర్య సమరయోధుడు, సీనియర్ జర్నలిస్ట్ ఎం.ఎస్.ఆచార్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్
విలువలతో కూడిన జర్నలిజాన్ని నడిపిన వ్యక్తి ఎం.ఎస్.ఆచార్య, నాటి జర్నలిజానికి నేటి జర్నలిజానికి ఎంతో తేడా ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హాయాంలోనే జర్నలిస్టులకు అన్ని విషయాలలో న్యాయం, సదుపాయాలు అందాయని మంత్రులు చెప్పారు.

మీడియాలోకి కార్పోరేట్ రంగం అడుగుపెట్టడం ప్రమాదకరమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
విలువలతో కూడిన జర్నలిజం చేయండని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రముఖ తెలంగాణ పోరాటయోదుడు, సీనియర్ జర్నలిస్ట్ ఎం.ఎస్.ఆచార్య విగ్రహాన్ని శనివారం నాడు హైదరాబాద్ గోపనపల్లిలోని జర్నలిస్ట్ కాలనీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఎంఎస్.ఆచార్య కుమారుడు మాడభూషి శ్రీధర్ రూపొందించిన ఈ విగ్రహన్నీ శిల్పి ఉపేంద్ర తయారుచేశారు. ఎంఎస్.ఆచార్య పేపర్ బాయ్ నుంచి ఎడిటర్ గా ఎదిగి జనధర్మ, వరంగల్ వాణి వంటి పత్రికలను నడిపి ఎన్నో అంశాలను వెలుగులోకి తీసుకొచ్చారనీ ఆయన లాంటి జర్నలిస్టులు నేటి తరం వారికి ఎంతో స్పూర్తి అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, పదిమందికి విషయాలు తెలియాలని తపించేవారన్నారు. ఎం.ఎస్.ఆచార్య వివిధ పత్రికల్లో పనిచేసి, అక్షరాన్ని నమ్ముకున్న వ్యక్తి గా, చరిత్రలోనిలబడే వ్వక్తిగా పేరుతెచ్చుకున్నారని అన్నారు. ఇక వారికుమారుడు మూడభూషి శ్రీధర్ కూడా వారి తండ్రి వదలిన విలువలను ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ఎం.ఎస్.ఆచార్య గారి విగ్రహ ఆవిష్కరణకు రావడం మాకు గొప్ప అవకాశమని మంత్రులు చెప్పారు. అక్షరం అమ్ముడుపోయే వస్తువు కాదు..సామాజిక చైతన్యం రావాలని, కొత్త తరం జర్నలిస్టు సోదరులు ఇంకా అనేక అంశాలు నేర్చుకోవాలనీ, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా జర్నలిస్టులు ఎదగాలని ఆయన అభిప్రాయపడ్డారు. కార్పోరేట్ రంగం మీడియాలో అడుగుపెట్టడం శుభపరిణామం కాదనీ, అందర్ని డిక్టెట్ చేయడం, జర్నలిజాన్ని డిక్టేట్ చేయడం సరికాదని అన్నారు. జర్నలిజం ఫీల్డ్ లో కూడా రెడీమేడ్ కాకూడదనీ, గతంలో ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ చూస్తే ఒక ఇనిస్ట్యూట్ లా ఉండేదనీ నేడు ఆ పరిస్థితి లేకపోవడం శోచనీయమనీ, విలువలతో కూడిన జర్నలిజాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత నేటి తరం పై ఉందన్నారు. జనధర్మ పత్రిక మళ్లీ రావడం చాలా సంతోషకరమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో నాటి తరం నుంచి నేటి తరం వరకూ అందరికీ స్పూర్తిని అందించిన వ్యక్తి ఎం.ఎస్.ఆచార్య అని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో చిన్న పత్రికలు ఎంతో ప్రముఖపాత్రను పొషించాయనీ అందులో జనధర్మ, వరంగల్ వాణి చాలా కీలక పాత్ర పోషించాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరిపార్టీ అనీ జర్నలిస్టులకు న్యాయం చేస్తుందన్నారు. మేం ప్రజాస్వామ్యాన్ని విశ్వసించాము. అందుకే మేం ఇంతవరకూ పేపర్, ఛానల్ పెట్టలేదన్నారు. జర్నలిస్టులు విమర్శలు చేయవచ్చు. కానీ విలువలతో కూడా విమర్శలు చేస్తే ఎవరీ ఇబ్బంది ఉండదనీ, ప్రముఖులను మార్గదర్శంగా తీసుకొని నేటి తరం మీడియా ముందుకు వెళ్లాలని పొన్నం ప్రభాకర్ కోరారు. మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎం.ఎస్. ఆచార్య గారు కేవలం వరంగల్ కే పరిమితం అయ్యారు, వారు హైదరాబాద్ లో ఉండి ఉంటే ఎక్కడో ఉండేవారన్నారు. వరంగల్ లో జర్నలిస్ట్ అంటే ఎం ఎస్ ఆచార్యగారే. ఆయన వద్ద చాలా మంది పనిచేశారు. వారి నుంచి ఎంతోమంది జర్నలిస్టులు ఎంతో నేర్చుకున్నారని అన్నారు. ఈ సొసైటీకి కూడా స్థలాలు వచ్చే విధంగా మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలని కోరారు.
సొసైటీ అధ్యక్ష్యుడు బ్రహ్మాండభేరి గోపరాజు మాట్లాడుతూ…మంత్రులకు హౌసింగ్ సొసైటీ యొక్క పరిస్థితిని వివరించారు. కాంగ్రెస్ పార్టీ హాయాంలోనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చారనీ, వారి వల్లనే మూడు కాలనీ ఏర్పాడ్డాయని గుర్తు చేశారు. త్వరలోనే ఈ సొసైటీలోని నాన్ అలాటీస్ కు న్యాయం చేసే విధంగా మంత్రులు ప్రయత్నించాలని కోరారు.
నాన్న చూపిన బాటలోనే నడిచానని, ఆయన వల్లనే నేను ఇంతటివాడిని అయ్యానని, వారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని మాడభూషి శ్రీధర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరిక్రిష్ణ, సీనియర్ జర్నలిస్టులు ఎన్. రామచంద్రమూర్తి, ధరూరి వెంకటాచారితో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు, కాలనీవాసులు, ఎం.ఎస్.ఆచార్య కుటుంబసభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.