ఈటూరులో మానవత్వం మెరుపులు యువకుల సేవా ఆదర్శం
బొల్లెట్ల పద్మ మరణించడంతో ఆమె కుటుంబానికి యువత అండ
మనిషికి మనిషి తోడు విషాదంలో ఉన్న కుటుంబానికి సహకారం
కష్టకాలంలో సహాయం చేసిన మిత్రబృందం క్వింటా బియ్యం అందజేత
గ్రామ యువత చేతుల్లో మానవత్వం రూ.10,000/- ఆర్థిక సహాయం
నాగారం, అక్షిత న్యూస్ :
మండల పరిధిలోని ఈటూరు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన బొల్లెట్ల పద్మ మరణం గ్రామ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచింది. ఈ దుర్ఘటనతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ, గ్రామానికి చెందిన యువకులు మానవత్వంతో ముందుకు వచ్చి ఆదర్శప్రాయమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. బొల్లెడ్ల నరేష్ ఆధ్వర్యంలోని మిత్రబృందం బాధిత కుటుంబాన్ని ప్రత్యక్షంగా పరామర్శించి, వారి పరిస్థితిని తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని క్వింటా బియ్యం అందజేయడంతో పాటు, రూ.10,000/-నగదు ఆర్థిక సాయం చేసి వారి బాధను కొంత మేర తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటే అందరం కలిసి సహాయం చేయడం మన బాధ్యత అని తెలిపారు. మనిషికి మనిషి తోడుగా ఉండే సమాజమే నిజమైన బలం అని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మంది యువత ప్రేరణ కలిగించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లింగాల హరీష్, మేడేబోయిన రమేష్, మేడబోయిన గిరి, కర్కాని శ్రీను, గంట వెంకట్ రెడ్డి, బండి రవి, చిక్కులపెల్లి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.