విధుల్లోనే మృత్యువోడిలోకి చేరిన ఉపాధ్యాయుడు
వరంగల్, అక్షిత బ్యూరో :
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తూనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందారు. మండలంలోని టూక్యా నగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ (46) సోమవారం ఉదయం సాధారణంగా పాఠశాలకు హాజరయ్యారు. తరగతులు నిర్వహిస్తున్న సమయంలో తరగతి గది లోనే అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆయనను నెక్కొండలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు సంగెం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందినవారని తెలిసింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.