ముందే మెట్టు దిగిఉంటే ప్రాణం మిగిలేది!
హైదరాబాద్ అక్షిత ప్రతినిధి
ప్రభుత్వాలు చాలా సందర్భాల్లో ఇలాంటి మొండి పట్టుదలలతో ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటూ ఉంటాయి. అలవిమాలిన డిమాండ్లతో ఎవరైనా పోరాటం ప్రారంభించి ఉంటే.. బహుశా ఇంకో రకంగా పరిస్థితులను మదింపు చేయగలం. కానీ.. ఇదే ప్రభుత్వం ఎన్నికల సమయంలో కల్పించన ఆశల వల్లనే మొదలైన పోరాటం ఇది. మరింత బాధ్యతగా స్పందించాల్సిన చోట రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లిప్తత వహించింది. సుదీర్ఘకాలం ఎదురుచూసిన ఆర్టీసీ కార్మికులు పోరాటానికి దిగారు. బలిదానం జరిగింది. మీనమేషాలు లెక్కించిన ప్రభుత్వం మెట్టు దిగివచ్చింది. డిమాండ్లకు అంగీకరించింది. అయితే వారి కాలయాపన వల్ల అన్యాయంగా ఒక ప్రాణం పోయింది. డ్రైవర్ శంకర్ గౌడ్ అసువులు బాశారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు కన్నూమిన్నూ కానదు. ఏ మాటలు చెప్పి అయినా సరే.. ఓట్లు దండుకోవడం ఒక్కటే వారి టార్గెట్ గా కనిపిస్తుంది. వంద అబద్ధాలు చెప్పి అయినా ఒక పెళ్లి చేయమని పెద్దలు అన్నారనే సామెతను నాయకులు ఎన్నికలకు ఇంకా బాగా వర్తింపజేస్తుంటారు. ఒక్కొక్క ఓటును దండుకోవడానికి వందల వేల అబద్ధాలను వండి వారుస్తుంటారు. అలవిమాలిన హామీలు ఇస్తుంటారు. ఆచరణలో ఎదురుకాగల ఇబ్బందులను పట్టించుకోరు. ఒక వర్గంలో ఆశలను పుట్టించి.. వారిని ప్రలోభ పెట్టి తమకు అనుకూలంగా ఓట్లుగా మలచుకోవడం ఒక్కలే వారికి సబబుగా కనిపిస్తుంది ఆ సమయంలో అలాంటి హామీనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ కూడా. ఒకవైపు పొరుగు రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ముందు ప్రకటించిన హామీ కాకపోయినప్పటికీ.. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేసుకుని వారి ఉద్యోగాలకు ఒక స్థిరత్వాన్ని ఇచ్చారు. అక్కడ ఆచరణలో బ్రహ్మాండంగా నడుస్తోంది. ఆ వ్యవస్థను అధ్యయనం చేసి.. ఏపీకంటే ఎక్కువ ఆదాయం గల తెలంగాణలో అదే పనిచేయడం కష్టం కాబోదు కదా.. అనే ఉద్దేశంతోనే కార్మికులు రేవంత్ మాటలను నమ్మి ఓట్లేశారు.అయితే గెలిచిన తర్వాత సర్కారు మొహం చాటేసింది. ఆర్థిక భారాల లెక్కలు తీయడం ప్రారంభించింది. పోరాటం బలిదానాలు కోరిన తర్వాత గానీ.. వారు దిగిరాలేదు. మొత్తానికి 11 శాతం ఫిట్మెంట్ ఇవ్వడానికి, ప్రభుత్వంలో విలీనంపై కమిటీ వేయడానికి ప్రభుత్వం అంగీకరించింది.ఇంటిపెద్దను కోల్పోయిన శంకర్ గౌడ్ కుటుంబానికి పదిలక్షల రూపాయలు, ఒక ఇల్లు, ఒక ఉద్యోగం హామీ మాత్రమే మిగిలాయి. ప్రభుత్వాలు కనీసం తాము ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలోనైనా.. ప్రజాందోళనలు ఉద్యమరూపం దాల్చినప్పుడు వెంటనే స్పందించడం నేర్చుకుంటే ప్రాణత్యాగాలు జరగవు.