పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో అంతర్ రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్ట్.

పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో అంతర్ రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్ట్.

కరీంనగర్ అక్షిత బ్యూరో

ఈ నెల 3 ఆదివారం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో కరుడుకట్టిన అంతర్ రాష్ట్ర దోపిడీ ముఠాను కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్ లోని అస్త్ర కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలం వెల్లడించారు. పీఎంజె జ్యువెలరీ షాపులో జరిగిన దోపిడీలో 161.4 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ల వజ్రాభరణాలు కలిపి మొత్తం రూ.82,02,000/- విలువైన ఆభరణాలు దోపిడికి గురైనట్లు తెలిపారు. దోపిడి సమయంలో దొంగలు కాల్పులు జరిపారని, ఈ ఘటనలో నలుగురు స్టాఫ్ గాయపడ్డారన్నారు. ఈ దోపిడికి సంబంధించిన ఆపరేషన్‌ను ప్రస్తుతం బీహార్ జైలులో ఉన్న అంతర్రాష్ట్ర గ్యాంగ్ హ్యాండ్లర్, “ది గోల్డెన్ థీఫ్” గా పేరొందిన సుభోద్ సింగ్ ప్రణాళికా బద్ధంగా నిర్వహించినట్ల వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ @ జగీరా సింగ్‌ను ఈ నెల 13 సాయంత్రం 4:00 గంటల సమయంలో వెలిచాల ఎక్స్ రోడ్ వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు రవీష్ కుమార్ @ ప్రద్యుమన్, మెహతాబ్ ఖాన్‌లను బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్‌పై తీసుకువచ్చినట్లు చెప్పారు. పోలీసులు ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ ను విచారిస్తున్న క్రమంలో బీహార్, బెంగాల్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా గురించి కీలక సమాచారం బయటపడింది. ఈ ముఠా బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జ్యువెలరీ షాపులు మరియు బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు నిర్వహిస్తున్నట్లు తెలిసిందన్నారు. “ది గోల్డెన్ థీఫ్”గా పేరొందిన సుభోద్ సింగ్ నాయకత్వంలో ఈ గ్యాంగ్ ఏర్పడినట్లు విచారణలో తేలింది. ఈ ముఠా ముందస్తుగా రేక్కీ నిర్వహించడం, నేరము చేసిన తరువాత తప్పించుకునే మార్గాలను గుర్తించడం, నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ బైక్ నంబర్ ప్లేట్లు ఉపయోగించడం, తప్పుడు పేర్లతో లాడ్జ్‌లలో ఉండడం, ఆధునిక సాంకేతికత వినియోగించడం వంటి పద్ధతులతో ఆయుధాలతో దోపిడీలు నిర్వహించేది. సుభోద్ సింగ్, అతని అనుచరులు రఘునాథ్ కర్మాకర్ @ జగీరా సింగ్, రవీష్ కుమార్ @ ప్రద్యుమన్, రాధే @ అభయ్, ప్రమోద్ గోస్వామి @ మిశ్రా, సూర్యమణి కుమార్ @ సనోజ్ ప్రణాళిక ప్రకారం నిందితులు తెలంగాణకు రెండు నెలల క్రితం వచ్చారు.తెలంగాణలోకి ప్రవేశించే ముందు వీరు జార్ఖండ్-పశ్చిమ బెంగాల్ సరిహద్దులో మెహతాబ్ ఖాన్ వద్ద ఒక్కో సిమ్ కార్డును రూ.10,000 చొప్పున కొనుగోలు చేశారు. అనంతరం వీరు ఖమ్మం, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో తిరుగుతూ జ్యువెలరీ షాపులు, బ్యాంకుల పై రేక్కీ నిర్వహించారు. చివరకు కరీంనగర్‌లోని పీఎంజె జ్యువెలరీ షాప్‌ను లక్ష్యంగా ఎంచుకుని పెద్దపల్లిలోని ఒక లాడ్జ్‌ లో బస చేశారు. మే 1 వ తేదీన ధర్మపురిలోని విజయలక్ష్మి గెస్ట్ హౌస్‌కు మారి దోపిడీకి సిద్ధమయ్యారు.సుభోద్ సింగ్ అనుచరుల సమాచారంతో రఘునాథ్ కర్మాకర్ మంచిర్యాలకు వెళ్లి రైలులో చంద్రపూర్ సమీపానికి చేరుకున్నాడు. అక్కడ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మే 2 వ తేదీన గడ్‌చందూర్ పరిసరాల్లో ఆరు పిస్టల్స్, మ్యాగజైన్లు అందజేశారు. అనంతరం రఘునాథ్ కర్మాకర్ ఆయుధాలతో ధర్మపురికి తిరిగి వచ్చాడు. ఈ నెల 3 న ఉదయం ఐదుగురు నిందితులు ధర్మపురిలో వారు ఉన్న లాడ్జ్ ఖాళీ చేసి రెండు బైక్‌ల పై బయలుదేరారు. బ్యాగులను కొండ ప్రాంతంలో దాచిపెట్టి, అక్కడే వారి బైక్ నంబర్ ప్లేట్లు మార్చి, వెలిచాల ఎక్స్ రోడ్ వద్దకి చేరుకొని అక్కడ టిఫిన్ చేసి, దోపిడీ ప్రణాళికను మరోసారి చర్చించారు.తరువాత ఉదయం 10:50 గంటలకు పీఎంజె జ్యువెలరీ షాప్‌కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం రాధే @ అభయ్ కస్టమర్‌లా షాప్‌లోకి వెళ్లి పరిస్థితిని గమనించాడు. రాధే ఇచ్చిన సమాచారం తర్వాత మిగతా నిందితులు లోపలికి ప్రవేశించి సిబ్బందిని ఆయుధాలతో బెదిరించారు. నగలు దోచుకొనుచునడగా స్టాఫ్ ప్రతిఘతించడముతో నిందితులు వారి వద్ద ఉన్న ఆయుదాలతో స్టాఫ్ పై కాల్పులు జరిపారు.నిందితులు షాప్ నుండి పారిపోతూ వారు షాపులో దోచుకున్న ఒక ఆభరణాల బ్యాగ్‌ను తీసుకుని పారిపోయారు. ఆందోళనలో మరో బ్యాగ్‌ను షాప్‌లోనే వదిలివేశారు. ముందుగా నిర్ణయించిన మార్గంలో ధర్మపురికి చేరుకున్నారు.సనోజ్, రాధే @ అభయ్, ప్రద్యుమన్ గోదావరి నది ఒడ్డున పల్సర్ బైక్‌ను వదిలి నడుచుకుంటూ నది దాటి మంచిర్యాల నుంచి రైలులో పరారయ్యారు.మరోవైపు రఘునాథ్ కర్మాకర్ @ జగీరా సింగ్ మరియు మిశ్రా ఆభరణాల బ్యాగ్‌తో అపాచీ బైక్‌పై గుండాల అడవి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ తెలుపు రంగు క్రెటా కారులో వచ్చిన వ్యక్తులకు బ్యాగ్ మరియు బైక్ అప్పగించి సమీప రైల్వే స్టేషన్ ద్వారా బీహార్‌కు పారిపోయారు.సాంకేతిక నిఘా ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఇప్పటివరకు 13 మంది నిందితులను గుర్తించాయి.ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, నకిలీ ఆధార్ కార్డులు, రూ.51,000 ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.మిగిలిన నిందితులు మరియు దోచుకెళ్లిన ఆభరణాల కోసం ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking